వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు పడే అవకాశాలు లేవని దాదాపు తేలిపోయింది. అనర్హత పిటిషన్ వేయాలని వైసీపీ, వేసేందుకు లేదని తిరుగుబాటు ఎంపీ లోక్ సభ స్పీకర్ కార్యాలయం వేదికగా పరస్పరం వాదులాడుకుంటున్నారు.
ఎంపీ పై అనర్హత వేటు వేయాల్సిందే అని పట్టుదలగా లోక్ సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ చాలాకాలంగా పోరాటం చేస్తున్నారు. అయితే ఎవరెంత పోరాటం చేసినా ఎంపీగా అనర్హత వేటు సాధ్యం కాదని స్పీకర్ కార్యాలయం చేసిన ప్రకటనతో అర్థమైపోయింది.
అనర్హత పిటిషన్ పై లోక్ సభ హక్కుల సంఘం విచారణ జరిపింది. పార్టీ జారీచేసిన విప్ ఉల్లంఘించినపుడు మాత్రమే అనర్హత వేటుకు గురవుతారు కానీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసినంతమాత్రాన అనర్హతకు గురికారంటు కమిటి తేల్చి చెప్పేసింది. ఇదే సమయంలో ఎంపీ ఇచ్చిన ఫిర్యాదును కూడా కమిటీ పక్కన పడేసింది.
తన పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని రఘురాజు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఆ పిటీషన్ను కూడా కమిటీ తోసిపుచ్చింది. థర్డ్ డిగ్రీ ప్రయోగం తమ పరిశీలనలోకి రాదని కమిటీ చెప్పేసింది.
పార్లమెంటు విధుల నిర్వహణలో ఎంపీని ఎవరైనా అడ్డుకుంటే మాత్రమే తమ పరిశీలనలోకి వస్తుందని బయట జరిగే గొడవలు తమ పరిధిలోకి రాదని కమిటి స్పష్టంగా చెప్పేసింది. మొత్తానికి ఇటు వైసీపీ అటు రఘురాజు పరస్పరం చేసుకున్న ఫిర్యాదులు రెండింటినీ కమిటి కొట్టేసింది. అంటే ఎవరు కూడా ప్రత్యర్ధులపై విజయం సాధించినట్లు కాదు.
కానీ ఎంపీ పై అనర్హత వేటు వేయించేందుకు పార్టీ తరపున తెగ ప్రయత్నాలు జరిగాయి. ఒకళ్ళపై యాక్షన్ తీసుకునేట్లు చేయటంలో చేసుకున్న ఫిర్యాదుల్లో ఇద్దరు ఫెయిలైనట్లే భావించాలి. ఒక ఎంపీ ఫెయిలవ్వటంలో ఆశ్చర్యం లేదు.
కానీ కేంద్రంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతు కూడా ఎంపీపై అనర్హత వేటు వేయించలేకపోయిన జగన్మోహన్ రెడ్డి ఫెయిలైనట్లే భావించాలి. కాకపోతే నిబంధనల ప్రకారం కమిటి నడుచుకున్న కారణంగా ఎంపీ అనర్హత వేటు నుండి తప్పించుకున్నారు. మరిపుడు రఘురామ ఏమి చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates