గ్రూపు రాజ‌కీయాలు చేస్తే.. ఇంటికే: కేటీఆర్ క్లాస్‌

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం విభేదాలు వీడి నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఖమ్మంలో ప‌ర్య‌టించిన‌ మంత్రి కేటీఆర్.. ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. అసంతృప్త నేతలు పార్టీ మారుతారన్న ప్రచారం దృష్ట్యా.. ఈ ప్రత్యేక భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా పనిచేయాలని నేతలకు మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

ఉమ్మడి జిల్లాలో టీఆర్ ఎస్‌ బలోపేతంపై మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. నేతల మధ్య విభేదాలు పరిష్కారం కోసం నేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. టీఆర్ ఎస్‌ ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో నేతల మధ్య విభేదాలు ఉండకూడదని సూచించారు. ఖమ్మం మినహా ఇతర నియోజకవర్గాల్లో నేతల మధ్య గ్రూప్‌ రాజకీయాలు తగదని హితవు పలికారు. జిల్లాలో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయంపై కేటీఆర్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గ్రూపు చేస్తే.. ఆ నాయ‌కుల‌ను నిర్మొహ‌మాటంగా ఇంటికి పంపుతామ‌ని హెచ్చ‌రించారు.

ఇదిలావుంటే, కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి ప్రతిరోజు టూరిస్ట్‌లు వస్తున్నారని ఎద్దేవాచేశారు. ఒక్క చాన్స్‌ ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్‌ అంటున్నారని, 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. ఎంపీ రేవంత్ రెడ్డి రెడ్లకు అధికారం ఇవ్వాలని బహిరంగంగా చెబుతున్నారని, కులపిచ్చిగాళ్లు కావాలా?, అభివృద్ధి కోసం పాటుపడే టీఆర్ఎస్ కావాలా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.