కృష్ణాజిల్లాలోని మాజీ మంత్రి-ఎంపీల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పర్యటనలో కొందరు కార్యకర్తలు గొడవ చేశారు. ఆ గొడవకు మాజీ మంత్రి పేర్ని నానియే కారణమని ఎంపీ మీడియాలోనే ఆరోపించారు. దాంతో ఎంపీ, మాజీ మంత్రి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ బందరులోని ఒక కార్యక్రమానికి వెళుతుండగా పేర్ని మద్దతుదారులు గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నానా రచ్చ చేశారు.
దీంతో వీళ్ళిద్దరి మద్య విభేదాలు బయటపడ్డాయి. ప్రజాసమస్యల పరిష్కారానికి, పథకాల పరిశీలనకు తాను పర్యటిస్తుంటే నాని వర్గీయులు అడ్డుకోవటం ఏమిటంటు ఎంపీ మండిపడ్డారు. మాజీమంత్రి కార్యకర్తలు అడ్డుకుంటున్న ఎంపీ ముందుకే వెళ్ళాలని డిసైడ్ అవటంతో రెండువర్గాల మధ్య తోపులాటలు మొదలయ్యాయి. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. పోలీసులకు ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే రెండు వర్గాలూ అధికార పార్టీ నేతలవే కావటంతో ఎవరికీ నచ్చచెప్పలేకపోయారు.
చివరకు అగ్రనేతలు తమ మద్దతుదారులతో మాట్లాడటంతో రెండు వర్గాల వాళ్ళు కాస్త శాంతించారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని రెండువర్గాలను అక్కడినుండి పంపేశారు. ఇపుడు బహిరంగంగా జరిగిన గొడవను చూసిన తర్వాత ఎంపీ, నాని మధ్య అంతర్గతంగా చాలా గొడవలే ఉన్నట్లు అర్ధమవుతోంది. కాకపోతే ఇంతకాలం వీళ్ళ మధ్య విభేదాలు చాపకింద నీరులా లోలోపలే ఉండిపోయింది. తన నియోజకవర్గం పరిధిలోని అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాను పర్యటించటానికి ఎవరి అనుమతి అవసరం లేదని ఎంపీ తేల్చిచెప్పారు.
తర్వాత ఎంపీ మీడియాతో మాట్లాడుతూ నానిపై మండిపడ్డారు. మచిలీపట్నం నాని అడ్డా అనుకుంటున్నారా అంటు నిలదీశారు. తనను చాలాకాలంగా నాని ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపించారు. బందరు నియోజకవర్గం పరిధిలోని కార్యక్రమాల్లో దేనికీ మూడేళ్ళుగా పిలవలేదని ఎంపీ ఆరోపించారు. ఇకనుండి తాను బందరులోనే ఉంటానని, బందరులో జరిగే ప్రతి కార్యక్రమానికి హాజరవుతానంటు ప్రకటించారు. సొంత పార్టీ ఎంపీనే అడ్డుకోవటం నానికి ఏమాత్రం మంచిది కాదని బాలశౌరి వార్నింగ్ ఇవ్వటం కలకలం రేపింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates