తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయించారు. దీనికి భారత రాష్ట్ర సమితి(బీఆర్ ఎస్)గా పేరు పెట్టాలని ఆయన ఒక తీర్మానం చేసినట్టు తెలిసింది. ఈ నెలాఖరులోనే జాతీయ పార్టీపై కేసీఆర్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. టీఆర్ ఎస్ మంత్రులు, నేతలతో సీఎం కేసీఆర్.. ఐదు గంటలపాటు సుదీర్ఘంగా జరిపిన సమావేశంలో రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
ఉద్దేశపూర్వకంగానే కేంద్రం తెలంగాణను ఇబ్బందులు పెడుతోందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పథకాలకు ఇతర రాష్ట్రాల్లోనూ మంచి స్పందన వస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జాతీయ స్థాయిలో రాజకీయ శూన్యత ఉందని నేతలు పేర్కొన్నారు. దేశానికి తెలంగాణ నమూనా అవసరమని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో టీఆర్ ఎస్ క్రియాశీలకం కావాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు జాతీయ పార్టీకి మొగ్గు చూపారు.
అవసరమైతే జాతీయ పార్టీ పెడతానని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పాత్ర తగినవిధంగా ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశం కోసం పనిచేస్తానని కేసీఆర్ తెలిపారు. జూలై 25తో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుండడంతో ఈ లోపు రాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్, ఇతర పార్టీల్లో రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ జరుగుతోంది.
టీఆర్‌ఎస్ తటస్థంగా ఉండిపోతుందా? లేక ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసి, ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించడానికి కేసీఆర్ వ్యూహాన్ని పన్నుతున్నారా? అని చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి టీఆర్‌ఎస్ మద్దతిచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. కేసీఆర్ జాతీయ స్థాయి పర్యటనలు చేపడుతూ విపక్షాలను కూడగడుతున్నది ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికేనని అంటు న్నారు. ప్రస్తుతం ఆయన దీనిపైనే వ్యూహ రచన చేస్తున్నారని పేర్కొంటున్నారు.