ఓన్‌గానే వ‌చ్చేద్దాం.. టీడీపీ శ్రేణుల మాట ఇదే!

ఔను! వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేయాల‌ని.. ఓన్‌గానే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని.. టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏపీ ప్ర‌జ‌లు జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర వ్య‌తిరేత‌క‌తో ఉన్నార‌ని.. ఈ స‌మ‌యంలో టీడీపీ వైపే వారు చూస్తున్నార‌ని.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుల నుంచి జూనియ‌ర్ నేత‌ల వ‌ర‌కు అంద‌రూ ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో అభివృద్ధి లేద‌నేది గ్రామ స్థాయి నుంచి ప‌ట్ట‌ణ స్థాయి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ చెబుతున్న మాట‌గా వారు పేర్కొంటున్నారు.

“ఎక్క‌డ ఎవ‌రిని క‌దిలించినా.. రాష్ట్రంలో అభివృద్ధి లేద‌ని.. చంద్ర‌బాబును గెలిపించుకోకుండా త‌ప్పు చేశా మ‌నే చెబుతున్నారు. రాష్ట్రంలో చంద్ర‌బాబు అధికారంలో ఉండి ఉంటే.. ప‌రిస్థితి వేరేగా ఉండేద‌ని.. అమ‌రావ‌తి రాజ‌ధాని అభివృద్ధి చెంద‌డంతోపాటు.. పెట్టుబ‌డులు కూడా వ‌చ్చేవని.. దీంతో రాష్ట్రంలో అభివృద్ధిలో ప‌రుగులు పెట్టి ఉండేద‌ని అంటున్నారు. దీనిని బ‌ట్టి.. టీడీపీకి మెరుగైన అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి” అని తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన ఒక సీనియ‌ర్ నాయ‌కుడు వ్యాఖ్యానించారు.

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. చంద్ర‌బాబు విజ‌న్ ప‌ట్ల ప్ర‌జ‌లు ఇప్పుడు మొగ్గు చూపుతున్నార‌ని.. జ‌గ‌న్ పాల‌న‌లో రోడ్లు కూడా వేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని.. దీనిని ప్ర‌జ‌లు తీవ్ర‌స్థాయిలో భావిస్తున్నార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రికోస‌మో.. పార్టీ వెయిట్ చేయ‌డం.. ఎవ‌రితోనే పొత్తుల‌కు ప్ర‌య‌త్నించ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని అంటున్నారు. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో పార్టీ ఒంట‌రిగా పోటీ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్క‌డం పెద్ద క‌ష్టం కాద‌ని అంటున్నారు.

దీనికి సంబంధించి మ‌రికొంద‌రు నాయ‌కులు కొన్ని లెక్క‌లు చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 100 నియోజ‌క‌వ‌ర్గాల‌ను ల‌క్ష్యంగా పెట్టుకుని ఇప్ప‌టి నుంచి కృషి చేస్తే.. గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అవుతుంద‌ని.. అధికారంలోకి వ‌చ్చేందుకు 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు పెద్ద క‌ష్టం కాద‌ని.. అయితే.. దీనికి సొంత‌గా కొంత మేర‌కు క‌ష్ట‌ప‌డితే స‌రిపోతుంద‌ని సూచిస్తున్నారు. అంత‌కు మించి.. ఎవ‌రితోనో పొత్తులు ఎందుకని చెబుతున్నారు. మొత్తానికి చంద్ర‌బాబు మ‌రి త‌మ్ముళ్ల మాట వింటారో లేదో చూడాలి.

ఏదేమైనా.. పార్టీ ఒంట‌రిగా వెళ్తే.. గెలుపు త‌థ్య‌మ‌నే మాట, పార్టీపైనా..చంద్ర‌బాబుపైనా.. నాయ‌కులు చూపుతున్న భ‌రోసా.. వంటివి పార్టీ గెలుపును మ‌రింత ఈజీ చేస్తాయ‌ని ప‌రిశీల‌కులు సైతం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో అస‌లు ఓటు బ్యాంకు లేని పార్టీలు.. ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా చ‌ర్చ‌కు కూడా రాని పార్టీలతో పొత్తుల కోసం ఎదురు చూడ‌డం క‌న్నా.. టీడీపీ ఒంట‌రిగానే ప్ర‌జ‌ల్లోకి వెళ్లడం మంచిద‌ని చెబుతున్నారు. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.