జగన్ ఆ క్రెడిట్ తీసుకున్నపుడు.. ఇదీ తీస్కోవాలిగా

మూడేళ్ల కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని వివాదాలో, ఎన్ని హాట్ టాపిక్సో. తరచుగా ఏదో ఒక పెద్ద ఇష్యూ తెరపైకి రావడం, దాని మీద ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం, ప్రతిపక్షాలు దాడి చేస్తుంటే ఎదురు దాడి చేయడం చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన అంశం.. పదో తరగతి పరీక్ష ఫలితాలే. చాలా ఏళ్ల నుంచి 95 శాతానికి అటు ఇటుగా ఉంటున్న పాస్ పర్సంటేజ్ ఒక్కసారిగా 67 శాతానికి పడిపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

దీనికి పూర్తిగా ప్రభుత్వాన్ని నిందించడానికి వీల్లేదన్నది స్పష్టం. ఎందుకంటే కరోనా కారణంగా గత రెండేళ్లూ పిల్లల చదువులు సవ్యంగా సాగలేదు. గత ఏడాది కాలంలోనూ స్కూళ్లు సరిగా నడవలేదు. క్లాసులు పూర్తి స్థాయిలో జరగలేదు. క్రమబద్ధంగా చదువుకునే అలవాటు తప్పింది. దీంతో విద్యార్థులు చదువుల్లో బలహీన పడ్డ మాట వాస్తవం. టీచర్ల వైపు నుంచి కూడా సమస్యలున్నాయి. ఈ నేపథ్యంలో కొంత మేర పాస్ పర్సంటేజ్ తగ్గితే అర్థం చేసుకోవచ్చు. కానీ డ్రాప్ మరీ ఎక్కువగా ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

దీని మీద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగుతుండటం.. ఎలా ఫెయిల్ చేస్తారని ప్రశ్నిస్తుండడమూ విడ్డూరమే. ఈ విషయంలో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా నడుస్తోంది. ఇదే అదనుగా జగన్ ప్రత్యర్థులు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య బెండపూడి స్కూల్ విద్యార్థులు కొందరు సీఎం జగన్‌ను కలవడం.. వాళ్లంతా అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లిష్‌లో మాట్లాడ్డం.. దాన్ని జగన్ మద్దతుదారులు వైరల్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతాలు జరిగిపోతున్నాయని, ఇదంతా జగన్ క్రెడిటే అని కొనియాడడం తెలిసిందే. ఆ వీడియోలను పట్టుకొచ్చి ఇప్పుడు నెటిజన్లు రెచ్చిపోతున్నారు.

ఆ పిల్లల్నే తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇది తప్పు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరో ట్రైన్ చేసి తీసుకొచ్చి ఈ పిల్లల్ని రాజకీయ వ్యూహంలో భాగం చేస్తే.. వాళ్లను ట్రోల్ చేయడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే.. అప్పుడు కొందరు విద్యార్థులు టీచర్ ప్రోత్సాహంతో ఇంగ్లిష్ మీద పట్టు సాధించడాన్ని మొత్తంగా ప్రభుత్వ పాఠశాలలకు ఆపాదిస్తూ.. ఇదంతా జగన్ విజయం అంటూ క్రెడిట్ ఇచ్చిన వైకాపా మద్దతుదారులు మాత్రం ఇప్పుడు పాస్ పర్సంటేజ్ ఈ స్థాయిలో పడిపోవడానికి జగన్ సర్కారు బాధ్యత అని ఒప్పుకుంటారా అనే ప్రశ్నలు మాత్రం తలెత్తుతున్నాయి. దీనికి వాళ్లేమని బదులిస్తారో?