గెలుపు వేరు,గెలుపునకు సహకరించే రాజకీయ శక్తి వేరు.జనసేన ఇంతవరకూ నేరు గెలుపును పెద్దగా అందుకోలేదు.కానీ కృషి చేస్తే అందుకోవచ్చు. ఇదే దశలో ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ ను ప్రొజెక్ట్ చేయాలని చెప్పడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అని కూడా ఓ ప్రశ్న వస్తోంది. కమ్యూనిస్టులు సైతం ఈ ప్రతిపాదన ఏమంత బాలేదని, రాజకీయ అపరిపక్వతకు సంకేతమనే అంటున్నాయి. బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తే ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కావొచ్చు. అదే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే బాబు ఎందుకని తన అవకాశాలను వదులుకుంటారు ? ఎందుకు తనకు దక్కే అదృష్టాన్ని వద్దనకుంటారు ? కనుక బలం వేరు.. అదేవిధంగా బలుపు వేరు. “బలం నిరూపించుకున్నాక ఎవ్వరైనా సంప్రతింపుల ద్వారా ఉన్నత పదవులు కోరుకోవడం తప్పే కాదు అని అంటున్నారు” రాజకీయ విశ్లేషకులు.
ట్విటర్ వేదికగా జనసేనకూ, టీడీపీకి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇవాళ పొత్తులకు సంబంధించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనే సీనియర్ టీడీపీ లీడర్ చెప్పిన మాటలు అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయని అంటోంది జనసేన. ఆయన చెప్పిన విధంగా క్వింటా వడ్లు తూగాలంటే కొన్ని వడ్లు అవసరం అవుతాయని, ఆ పాటి దానికే ఆ కొన్ని వడ్ల వల్లనే కాటా తూగిందనుకుంటే ఎట్లా ? అని గోరంట్ల చేసిన వ్యాఖ్యలకు జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ స్పందించారు. తమ కారణంగా ఎవరు నెగ్గారో ఎవరు ఓడారో జనాలకు తెలుసు అని చెబుతూ, ఎవరి బలుపు ఎంతో ఎవరి బాధ్యత ఎంతో అన్నది ముందున్న కాలంలో తేలిపోనుందని శ్రీనివాస్ ట్విటర్ లో గోరంట్లకు కౌంటర్ ఇచ్చారు. బలుపెంతో, బరువెంతో కాదు బాధ్యత ఎంతో అన్నది ముఖ్యం అని చెబుతూ.. కృష్ణ తులాభారం ఘటనను ఉదహరించారు.
ఇక 2014 మాదిరిగా పొలిటికల్ ఈక్వేషన్లు ఉండవనే తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య దూరం పెరిగిందనే అనుకోవాలి. పవన్ తో పొత్తుకు బీజేపీ సానుకూలంగానే ఉంది. సోము వీర్రాజు కూడా కొంత స్పష్టత కూడా ఇచ్చారు. బీజేపీ నాయకులు పవన్ తో పనిచేసేందుకు సిద్ధంగానే ఉన్నారని క్లారిఫికేషన్ ఇచ్చేశారు. ఇక రెండో ఆప్షన్ పై చంద్రబాబునే అడగాలంటూ సోము వీర్రాజు అన్నారు. ఈ దశలో పొత్తులు టీడీపీకి, పవన్ కూ కుదరవనే తేలిపోయింది. ఇక ఆ రోజు పల్లకీలు మోసిన తాము ఇప్పుడు ఆ విధంగా టీడీపీకి సహకరించే ప్రసక్తే లేదని కూడా జనసేన కార్యకర్తలు అంటున్నారు.
టీడీపీలో ఓ వర్గం మాత్రం పొత్తులు లేకుండానే ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని చెబుతోంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తులు లేకున్నా గెలిచే దమ్ము తమకు ఉందని, పొత్తుల కారణంగా వేరే పార్టీకి ఆ క్రెడిట్ ఇవ్వడం తమకు అస్సలు ఇష్టం లేదని కూడా చెబుతోంది. ఇక పవన్ బరువెంత అన్నది కూడాలి. పవన్ వెనుక కొందరున్నారు కనుక ఆ మాటలు వస్తున్నాయా ? ఆ మాటలే నిజం అయితే 2019లో మంచి ఫలితాలే అందుకోవాలి కదా! అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల కొట్లాట అన్నది వైసీపీకి బాగానే కలిసివచ్చేలా ఉంది.