ఆప్షన్ల పై టీడీపీ ఎదురుదాడి..నాలుగో ఆప్షనట

వచ్చే ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన మూడు ఆప్షన్ల పై టీడీపీ ఎదురుదాడికి దిగింది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకే మూడు ఆప్షన్లు ఇచ్చే స్ధాయికి పవన్ ఎదిగారా అంటు తమ్ముళ్లు మండిపోతున్నారు. 2014లో, 2019లో తాను తగ్గాను కాబట్టి 2024 ఎన్నికల్లో మీరే తగ్గాలంటు పవన్ పరోక్షంగా చంద్రబాబుకు చెప్పిన విషయం తెలిసిందే. ఇదే విషయమై టీడీపీ అధికారప్రతినిధి జీవీ రెడ్డి పవన్ ను వాయించేశారు.

అసలు పవన్ తగ్గిందెప్పుడో చెప్పాలన్నారు. 2014లో అసలు పవన్ పోటీయే చేయనపుడు ఇక తగ్గే అవసరం ఏముంటుందన్నారు. అలాగే 2019లో వామపక్షాలు, బీఎస్పీ పొత్తులు పెట్టుకుని 137 సీట్లలో జనసేన పోటీచేసిన విషయాన్ని గుర్తుచేశారు. 137 సీట్లలో పోటీ చేసిన జనసేన 16 నియోజకవర్గాల్లో మాత్రమే డిపాజిట్లు దక్కించుకున్న విషయాన్ని రెడ్డి గుర్తుచేశారు. కాబట్టి రెండు ఎన్నికల్లో తాను తగ్గానని పవన్ చెప్పటం పూర్తిగా అబద్ధమని రెడ్డి ఆధారాలతో సహా వివరించారు.

నిజంగానే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ కు ఉంటే ఇలాంటి మాటలు, అబద్ధాలు చెప్పరని రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎవరికోసం ఎవరు తగ్గాలో పవన్ ముందుగా ఆలోచించుకుని మాట్లాడాలని రెడ్డి హితవు చెప్పారు. బీజేపీతో జనసేన కలిసి పోటీచేసినా, జనసేన ఒంటరిగా పోటీచేసినా ఏమి జరుగుతుందో అందరికీ తెలుసన్నారు. ఈ పద్ధతిలో కాకపోయినా దెందులూరు మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ కూడా దాదాపు ఇలాగే స్పందించారు.

2014 ఎన్నికల్లో తన వల్లే టీడీపీ గెలిచిందని పవన్ చెప్పటాన్ని చింతమనేని ఎద్దేవా చేశారు. టీడీపీని గెలిపించేంత సీన్ నిజంగానే పవన్ కు ఉంటే మరి ప్రజారాజ్యం పార్టీ ఎందుకు ఓడిపోయిందో చెప్పాలని నిలదీశారు. అలాగే నరసాపురంలో సోదరుడు చిరంజీవిని ఎందుకు గెలిపించలేదో పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వీళ్ళసంగతి ఇలాగుంటే సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు పవన్ వాయించేస్తున్నారు. పవన్ ఇచ్చిన మూడు ఆప్షన్లకన్నా తాము నాలుగో ఆప్షన్ ఇస్తున్నట్లు చెప్పారు. ఇంతకీ ఆ నాలుగో ఆప్షన్ ఏమిటంటే జనసేన పార్టీని పవన్ మూసుకుని మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోవటం.