జైల్లో తోటి ఖైదీపై దాడి చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు

దారుణ నేరానికి పాల్పడి.. ఏపీ అధికారపక్షానికి భారీ డ్యామేజ్ ను చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మరో ‘ఘనకార్యానికి’ పాల్పడినట్లుగా చెబుతున్నారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తీవ్ర ఆరోపణల్ని ఎదుర్కొంటున్న అతను ప్రస్తుతం రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా తోటి ఖైదీ తో గొడవ పడిన ఎమ్మెల్సీ.. అతడిపై దాడికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఏదో విషయం మీద ఇద్దరికి మధ్య మాటా మాటా పెరిగిందని.. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్సీ కోపంతో అతనిపై చేయి చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబుకు జైల్లో సకల సౌకర్యాలు అందుతున్నాయని చెబుతున్నారు. జైలుకు వెళ్లిన రెండు రోజులకే పరుపు ఏర్పాటు చేశారని.. ఆయన కోరిన ఆహారాన్ని బయట నుంచి అందుతుందని చెబుతున్నారు. ఎమ్మెల్సీని బాగా చూసుకోవాలని జైలు అధికారులకు ‘పెద్ద’ స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లుగా చెబుతున్నారు. నిబంధనల ప్రకారం చూస్తే.. ఒక జైలు గదిలో ముగ్గురు ఖైదీల్ని ఉంచాల్సి ఉంటుంది.

కానీ..ఎమ్మెల్సీ అనంత బాబుకు మాత్రం అందుకు భిన్నంగా ఒక్కడినే ఒక గదిలో ఉంచినట్లుగా తెలుస్తోంది. అయితే.. తాజాగా బయటకు వచ్చిన సందర్భంలోనే తోటి ఖైదీతో గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. జైల్లో అనంతబాబు చేసిన దాడిలో ఎదుటి ఖైదీకి దెబ్బలు తగలకపోవటంతో అతన్ని ఆసుపత్రికి చేర్చలేదని చెబుతున్నారు. నిబంధనలకు భిన్నంగా జైల్లో ఉన్న అనంతబాబును పలువురు ప్రజాప్రతినిధులు పదే పదే కలుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆరోపణలు సరిపోనట్లుగా.. తాజాగా తోటి ఖైదీపై దాడి చేసిన వైనం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.