మిత్రపక్షంతో పవన్ కు గ్యాప్ వచ్చేసిందా? అవుననే అనిపిస్తోంది తాజా వ్యాఖ్యలను విన్న తర్వాత. మిత్రపక్షం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ మాత్రం ఇష్టపడటంలేదు. ఆ విషయం పవన్ మాటల్లో స్పష్టంగా తెలిసిపోయింది. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన కోసం వస్తున్న నడ్డాను కలిసే ఆలోచన లేదని పవన్ చెప్పటమే దీనికి నిదర్శనం. ఒకపుడు ఇదే నడ్డాను కలవటానికి పవన్ ఏకంగా ఢిల్లీకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే.
నడ్డాను కలవటానికి ఢిల్లీకి వెళ్ళిన పవన్ అదే నడ్డా ఇపుడు రాష్ట్రానికి వస్తుంటే కలిసే ఆలోచన లేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. పవన్ తాజా వ్యాఖ్యలను చూసిన తర్వాత బీజేపీతో జనసేనకు గ్యాప్ మొదలైందని అర్దమైపోతోంది. పైగా తనకున్న సంబంధాలన్నీ ఢిల్లీ బీజేపీ నేతలతోనే తప్ప ఏపీ బీజేపీ నేతలతో కాదని స్పష్టంగా ప్రకటించారు. జాతీయ పార్టీకి చెందిన రాష్ట్రంలోని నేతలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించటమే విచిత్రంగా ఉంది.
పార్టీ ఆవిర్భావ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడినపుడు బీజేపీ పెద్దల నుండి రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఇపుడేమో బీజేపీ నుంచి జనసేన ఎలాంటి రోడ్ మ్యాప్ తీసుకోలేదని ప్రకటించారు. తీసుకోలేదంటే రోడ్ మ్యాప్ వాళ్ళివ్వలేదా ? లేకపోతే వాళ్ళిచ్చిన రోడ్ మ్యాప్ నచ్చక పవనే తీసుకోలేదా ? లేకపోతే అసలు రోడ్ మ్యాపే ఇవ్వమని బీజేపీ చెప్పిందా ? అనే ప్రశ్నలకు పవన్ సమాధానాలు చెప్పాలి.