జూలై నెల 8,9 తేదీల్లో అధికార వైసీపీ రెండురోజుల పాటు ప్లీనరీ సమావేశాలు నిర్వహించబోతోంది. అధికారపార్టీ కాబట్టి రెండురోజుల ప్లీనరీ నిర్వహణలో కష్టమేముందని అనుకోవచ్చు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీయే రెండు రోజుల మహానాడును ఒంగోలులో నిర్వహించినపుడు వైసీపీకి పెద్ద కష్టమేమీకాదని కూడా లైట్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడే వైసీపీకి సమస్య వస్తోంది.
అదేమిటంటే అధికారంలో ఉన్న పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ యంత్రాంగం సహకారం కచ్చితంగా ఉంటుందనటంలో సందేహంలేదు. కానీ నేతలు, కార్యకర్తల్లో ప్లీనరీని విజయవంతం చేయాలనే కసి కనబడాలి. ఆ కసే ఉందా అన్నదే ఇక్కడ కీలకమైన పాయింట్. పార్టీ చివరిసారిగా 2017లో ప్లీనరీ నిర్వించింది. అప్పుడు నిర్వహించిన విజయవాడ-గుంటూరు మధ్యలోని నాగార్జున యూనివర్సిటి భవనాలకు ఎదురుగానే జూలైలో ప్లీనరీకి స్ధలాన్ని ఎంపికచేశారు.
ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే ఒంగోలులో మహానాడు సక్సెస్ అయ్యింది. మహానాడు నిర్వహణలో రెండోరోజు జరిగిన బహిరంగసభకు 5 లక్షలమంది జనాలు వచ్చారని చెప్పుకోవటం తెలుసు. ఒంగోలు పట్టణజనాభాయే సుమారుగా 2.5 లక్షలు. అలాంటిది 80 ఎకరాల్లో జరిగిన బహిరంగసభకు 5 లక్షలమంది ఎలా హాజరవుతారు ? సంఖ్యలో తేడావున్నా బహిరంగసభ కూడా సక్సెస్ అన్నది వాస్తవం.
మరిపుడు వైసీపీ ప్లీనరీ రెండోరోజు కచ్చితంగా బహిరంగసభ ఉంటుంది. ఆ బహిరంగసభ సక్సెస్ కావాలంటే టీడీపీ బహిరంగసభకు వచ్చిన జనాలకన్నా ఇంకా ఎక్కువ హాజరైతేనే ప్లీనరీ సక్సెస్ అయినట్లు లెక్క. ఎక్కడ తేడా వచ్చి జనాలు పలుచగా కనబడినా గోల గోలైపోతుంది. పైగా ప్లీనరి నిర్వహణ కూడా అమరావతి కోసం ఆందోళనలు జరుగుతున్న ప్రాంతానికి దగ్గరలోనే ఉండబోతోంది. ఇక్కడ ప్లీనరీ నిర్వహణ కష్టమన్న విషయం జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఆలోచించకుండానే ఉంటారా ? ఎన్ని ఆలోచనలు చేసిన తర్వాత ఈ స్ధలాన్ని ఎంపిక చేసుంటారు ? కాబట్టి బహిరంగసభ సక్సెస్ చేయటమే వైసీపీకి అతిపెద్ద సవాలు.