ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణాలో అధికారపార్టీ టీఆర్ఎస్ పై బీజేపీ మైండ్ గేమ్ పెంచేస్తోంది. మైండ్ గేమ్ కూడా బీజేపీ రెండు రకాలుగా మొదలుపెట్టింది. తాజాగా ఢిల్లీలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నిర్వహించటం మొదటిది. ఇక రెండోది ఏమిటంటే జూలై చివరలో పార్టీ జాతీయస్ధాయి కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించటం. జాతీయకార్యవర్గ సమావేశంలు నిర్వహించటం మామూలు విషయం కాదు.
ఎందుకంటే ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరగబోతున్నాయి. ఇక్కడ అన్నింటికన్నా కీలకమైనది ఏమిటంటే నరేంద్రమోడి, అమిత్ షా తో పాటు కేంద్రంలోని బీజేపీ మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎంపీలు మూడు రోజుల పాటు హైదరాబాద్ లో నే ఉండబోతున్నారు. నరేంద్రమోడి హైదరాబాద్ లో మూడురోజుల పాటు మకాం వేయటమంటే మామూలు విషయంకాదు. ఇదంతా బీజేపీ ఎందుకు చేస్తోందంటే సాధారణ ఎన్నికలకు ఏడాదిమాత్రం గడువుంది కాబట్టి.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీఆర్ఎస్ ను దెబ్బకొట్టి అధికారంలోకి రావాలని కమలనాదులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కేసీయార్ కు వ్యతిరేకంగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడల్లా బీజేపీ చీఫ్ బండి సంజయ్ నేతృత్వంలో నానా రచ్చ జరుగుతోంది. ప్రతిరోజు కేసీయార్ ను టార్గెట్ చేసుకుని బండి నానా గోల చేస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు రాష్ట్రంలో ఏదో కారణంతో పాదయాత్ర చేశారు. అధికారంకోసం తమతో కాంగ్రెస్ కూడా పోటీపడుతున్న కారణంగానే బీజేపీ తన ఆందోళనల్లో మరింత పదును పెంచుతోంది.
ఇందులో భాగంగానే మోడీ వచ్చే నెలలో మూడు రోజుల ఇక్కడే ఉండబోతున్నారు. ఈ సమయంలోనే పెద్దఎత్తున ఇతరపార్టీలకు చెందిన నేతలను బీజేపీలోకి చేర్చుకునేందుకు పార్టీ ముఖ్యలు ప్లాన్ చేస్తున్నారు. నిజంచెప్పాలంటే ఇపుడు బీజేపీకి అధికారంలోకి వచ్చేసేంత సీన్ లేదు. ఎందుకంటే 119 నియోజకవర్గాల్లో కనీసం 100 నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీచేసేంత గట్టి అభ్యర్ధులు లేరు. అలాంటిది అధికారంలోకి వచ్చేసేది తామే అని బీజేపీ నేతలంటున్నారంటే కేసీయార్ పై మైండ్ గేమ్ కాక మరేమిటి ?