హోటల్ ఎపిసోడ్ తో జగన్ పరివారం తప్పు చేసిందా?

విభజన రేఖలు స్పష్టంగా ఉంటాయి. అదే రంగమైనా కానీ. దూకుడు రాజకీయాలు మొదలైన తర్వాత.. ప్రత్యర్థులపై పైచేయి సాధించటం కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు ఈ మధ్యన ఎక్కువైందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ప్రతి నాణెనికి బొమ్మ.. బొరుసు ఎలానో.. ప్రతి రంగంలోనూ బయటకు తెలిసే నిజాలతో పాటు.. బయటకు రాని చాలానే విషయాలు ఉంటాయి. ఒకవేళ.. తెలిసినా.. వాటిని బాహాటంగా చర్చించే ప్రయత్నం చేయరు. అలాంటి లక్షణ రేఖల్ని బ్రేక్ చేయటం రెండు దశాబ్దాలుగా సాగుతూనే ఉంది.

రాజకీయాల్లోని ప్రతి దరిద్రానికి కారణం చంద్రబాబుగా ఆయన్ను వ్యతిరేకించే వర్గం అభివర్ణిస్తుంటుంది. అలా అని ఆరోపణలు చేసే వారు శుద్దపూసలా? అంటే కాని పరిస్థితి. గురివింద సామెతను గుర్తుకు తెచ్చేలా వ్యవహరించే ధోరణి ఈ మధ్యన ఎక్కువైంది. రాజకీయ ప్రయోజనం గతంలో మాదిరి దీర్ఘకాలికం కాకుండా.. ఇప్పటికిప్పుడు జరిగే ప్రయోజనం మీదనే ఫోకస్ పెరుగుతోంది. దీంతో.. అనవసరమైన విపరిణామాలకు కారణమవుతున్నాయి.

మొన్నటి పార్క్ హయత్ హోటల్ వ్యవహారాన్నే తీసుకుందాం. ఆ హోటల్ లో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి.. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తో పాటు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భేటీ మీద బయటకొచ్చిన సీసీ ఫుటేజ్ ఎపిసోడ్ ను చూస్తే.. ఇలాంటి వాటితో సాధించేది తక్కువ. కోల్పోయేది ఎక్కువన్న భావన కలుగక మానదు.

హైదరాబాద్ లోని పార్క్ హయత్ కి వచ్చి వెళ్లే ప్రతి ప్రముఖుడి సీసీ ఫుటేజ్ తోనూ ఇలాంటి రచ్చలు బోలెడన్ని సాగుతుంటాయి. అయితే.. కొన్నింటినే టార్గెట్ పెట్టినట్లుగా చేయటం వల్ల అపనమ్మకం అంతకంతకూ పెరిగిపోతుంది. ఎవరికి ఎప్పుడు ఎక్కడ అవకాశం వస్తే.. ప్రత్యర్థిని దెబ్బేయాలన్న ఆలోచనే వస్తుంది. దివంగత మహానేత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నవేళలో.. కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసే సీఎల్పీ సమావేశ మందిరంలో పలువురు ప్రముఖ నేతల మధ్య వ్యాపార లావాదేవీలు బహిరంగంగా సాగేవి.

ఏ నేతకు చెందిన కాంట్రాక్టు.. ఒక మంత్రి దగ్గర ఆగితే.. అదే విషయాన్ని ఓపెన్ గా మాట్లాడుకునే వారు. వారి సంభాషణ సమయంలో సీనియర్ జర్నలిస్టులు కూడా ఉండేవారు. తమ ముందు మాట్లాడిన మాటల్ని అక్షరం పొల్లు పోకుండా రాసేసి.. సంచలన కథనంగా మార్చొచ్చు. కానీ.. అలాంటి పని ఎవరూ చేయరు. ఎందుకంటే.. నమ్మకం మీద జరిగే పనుల్ని (అవి మంచివైనా.. చెడ్డవైనా) అలానే సాగనిద్దామనుకుంటారే తప్పించి.. దానితో ఏదో చేయాలన్న భావన ఉండదు.

తాజా హయత్ ఎపిసోడ్ కు వస్తే.. ముగ్గురు ప్రముఖులు.. ఒక హోటల్ లో ఒక రూంలో వేర్వేరు సమయాల్లో కలవటం అనే వ్యవహారం చట్ట వ్యతిరేకమైనది కాదు. దాని వల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. కేసులు గట్రా ఏమీ నమోదు కావు. ఇంకా చెప్పాలంటే నైతికతకు సంబంధించిన పరిధిలోకి రాదు.

మరెలాంటి ప్రయోజనం లేకుండానే జగన్ బ్యాచ్ ఇంత హడావుడి చేసిందా? అన్న సందేహం రావొచ్చు. బయట చూసే వారికి మూడు భిన్న ధ్రువాలుగా కనిపించే వారు ఒక స్టార్ హోటల్ లో గూఢపుఠాణి చేసినట్లుగా కనిపించటం ద్వారా.. వారి ఇమేజ్ ను కాస్త దెబ్బ తీయటం మినహా సాధించేదేమీ ఉండదు.

తాజా ఎపిసోడ్ కారణంగా సుజనాకు కానీ నిమ్మగడ్డకు కానీ కామినేనికి జరిగే నష్టం కంటే కూడా పార్క్ హయత్ కు జరిగే నష్టమే ఎక్కువ. ఇకపై చాలా వ్యవహారాలకు పార్క్ హయత్ ఏ మాత్రం క్షేమకరం కాదన్న ముద్ర పడుతుంది. అదే జరిగితే.. ఆ హోటల్ విశ్వసనీయత మీద పడే దెబ్బ నుంచి కోలుకోవటానికి చాలానే సమయం పట్టే అవకాశం ఉంది.

ఇకపై.. రహస్య సమావేశాలు నిర్వహించుకోవాలని అనుకునేవారు.. ఏ గెస్టు హౌస్ లోనో.. లేదంటే మరే మహానగరంలోనో..ఇంకేదైనా ఫాంహౌస్ లోనో భేటీ అవుతారు. జగన్ బ్యాచ్ అనుకున్నంతగా హోటల్ ఎపిసోడ్ పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఒక రోజు సంచలనంగా మిగిలింది. నిమ్మగడ్డ వెనుక చాలానే బ్యాక్ గ్రౌండ్ ఉందన్న ఇమేజ్ వచ్చింది.

ఇంత చేసిన జగన్ కు ఇప్పుడు కొత్త కష్టం వచ్చింది. అందుకే అంటారు..ఏదైనా ఆట మొదలు పెట్టటం తేలికే కానీ దాన్ని కొనసాగించటం కష్టమని, ఆపటం మరింత కష్టమని. ఇప్పుడు అలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. తమ పార్టీకి చెందిన నేతలను టార్గెట్ చేసిన వైనంపై బీజేపీ అగ్రనాయకత్వం ఒక్కసారి ఉలిక్కిపడటమే కాదు.. తెలుగు రాష్ట్రాధినేతల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్న అలెర్టు పెరుగుతుంది.

అంతేకాదు.. జగన్ ఏముందిలే చెప్పినట్టు వినే మనిషి అనుకునే భ్రమలు ఈ ఎపిసోడ్ తో బీజేపీ అగ్రనాయకత్వానికి తొలగిపోయాయి అంటున్నారు. ఇప్పటివరకూ ఢిల్లీలో చక్కటి సంబంధాల్ని మొయింటైన్ చేస్తున్న యువనేత పరివారం.. హోటల్ ఎసిసోడ్ తో అనవసరంగా కెలుక్కుందన్న మాటే బలంగా వినిపిస్తోంది. తమ వారి మీద నిఘాను కమలనాథులు జీర్ణించుకుంటారా? తమకు చెందినోడి మీద పెట్టిన నిఘా.. తమ మీదా పెట్టరన్న సందేహం వారికి కలిగితే.. ఇబ్బంది కమలనాథుల కంటే కూడా జగన్ బ్యాచ్ కే అన్నది మర్చిపోకూడదు.

కొసమెరుపు ఏంటంటే… అసలు నిమ్మగడ్డపై బీజేపీ అధికారిక స్టాండ్ తీసుకుని కేసు వేసిందని తెలిసినా జగన్ మోహన్ రెడ్డి ఇందులో చూపిన దూకుడు బీజేపీకి అంతగా నచ్చలేదన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఎపిసోడ్ తర్వాతే కేంద్ర పార్టీలో కీలక నేతలు రామ్ మాధవ్, కిషన్ రెడ్డిలు ఘాటుగా మాట్లాడటం గమనించాలి.