మహానాడు సక్సెస్.. క్రెడిట్ ఎవరి ఖాతాలోకి?

తెలుగుదేశం పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు సాగిన ఆ పార్టీ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాల్ని చూసింది. కానీ.. పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని గడిచిన మూడేళ్లుగా ఎదురైంది. ఎప్పుడూ లేని రీతిలో అధికారపక్షం నుంచి ఎదురయ్యే సవాళ్లు ఒక ఎత్తు.. మరోవైపు కేసుల చిక్కులతో పాటు.. అడుగు వేస్తే ఏమవుతుందో అన్న పరిస్థితి. దీనికి తోడు.. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయలేమనే కొందరు స్థానిక క్యాడర్ కారణంగా.. పార్టీ నీరసపడిపోయిన పరిస్థితి.

అలాంటి వేళ.. కార్యకర్తలు మహానాడుకు వచ్చేందుకు వీలుగా వాహనాల్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే అందుకు ఎదురైన ఎదురుదెబ్బల వేళ.. మహానాడు ఎలా సాగుతుందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
అయితే.. అంచనాలకు మించి.. ప్రజల్లో ఇంతటి స్పందన ఉందా? అని స్వయంగా తెలుగుదేశం నేతలు సైతం విస్మయం చెందేలా కార్యకర్తలు పోటెత్తిన తీరు ఇప్పుడు అధికార పక్షం సైతం ఆశ్చర్యపోయే పరిస్థితి. అసలేం జరుగుతుందన్న మధనం అధికారపార్టీలో మొదలైనట్లుగా చెబుతున్నారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం రెండో రోజు మహానాడుకు లక్ష నుంచి లక్షన్నర మంది వరకు వస్తే అద్భుతంగా జరిగినట్లుగా లెక్కలు వేసుకున్నారు. అందుకు భిన్నంగా అంచనాలకు రెట్టింపుగా వచ్చిన జనసందోహంతో తెలుగు తమ్ముళ్లు సంతోష పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. పోలీసు వర్గాల వేసిన అంచనా ప్రకారం దాదాపు మూడు లక్షలకు పైనే మహానాడు రెండో రోజున హాజరైనట్లు చెబుతున్నారు. ఇంత భారీగా ఎలా వచ్చారన్నది చూస్తే.. మిగిలిన జిల్లాల నుంచి కంటే ప్రకాశం జిల్లా నుంచి అంచనాలకు మించిన జనం తమ తమ వాహనాల్లో తరలి రావటంతో ఇంత భారీ సంఖ్య నమోదైనట్లుగా చెబుతున్నారు.

ఓవైపు మండే ఎండ.. మరోవైపు తీవ్రమైన ఉక్కపోత వేళ మహానాడుకు ఎంతమంది వస్తారు? వచ్చినా ఎక్కువ సేపు ఉండరేమో? అన్న భావన వ్యక్తమైంది. అందుకు భిన్నంగా వచ్చినోళ్లంతా గంటల తరబడి ఉండిపోవటం.. చంద్రబాబు ప్రసంగం కోసం వెయిట్ చేసిన వైనం తెలుగు తమ్ముళ్లలో సరికొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. మహానాడు సక్సెస్ ఎవరి ఖాతాలోకి వెళ్లనుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహానాడుకు ఇంత భారీగా జనసమీకరణ కోసం బాధ్యత తీసుకున్న నేతలకే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలంటున్నారు.

మహానాడును ఒంగోలులో నిర్వహించాలని నిర్ణయించినప్పుడు.. జన సమీకరణ బాధ్యతను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు.. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో పాటు.. ఒంగోలు ఎంపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్.. ఏలూరి సాంబశివరావు.. డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి లు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. వీరికి.. పలువురు నేతలు సాయంగా నిలిచారు. మొత్తంగా మహానాడు సక్సెస్ లో కీలకమైన జనసమీకరణ అంశంలో.. ఈ నేతలకే ఎక్కువ క్రెడిట్ దక్కుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.