కుంభ‌కోణాలు బ‌య‌ట పెడ‌తా: నారా లోకేశ్

పార్టీ నేతలకు దీర్ఘకాలం పదవుల విధానం రద్దు ప్రతిపాదన పెట్టినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ విధానాన్ని తనతోనే అమలు చేయాలని భావిస్తున్నానని లోకేశ్ చెప్పారు. మహానాడు తరువాత రెండు పెద్ద కుంభకోణాలు బయట పెట్టబోతున్నట్లు వెల్లడించారు. మహానాడు సందర్భంగా లోకేశ్‌ మీడియాతో మాట్లాడారు.

మూడు సార్లు వరుసగా ఎన్నికల్లో ఓడినవారికి ఈసారి ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వరాదనే విషయంపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు  నారా లోకేశ్ అన్నారు. ఈ విషయంపై చంద్రబాబు స్పష్టతతో ఉన్నారని వివరించారు. మహానాడులో జరుగుతున్న చర్చలపై మీడియాతో లోకేశ్‌ మాట్లాడారు. పార్టీ నేతలకు దీర్ఘకాలం పదవుల విధానం రద్దు ప్రతిపాదన పెట్టానని వెల్లడించారు. ఈ విధానాన్ని తనతోనే అమలు చేయాలని భావిస్తున్నానని వివరించారు.

ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తాం. ఈలోగా కొంతమంది అభ్యర్థులకు స్పష్టత ఇచ్చేస్తాం. వచ్చే ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉండదని భావిస్తున్నా. పనిచేయని నేతలకు, ఇన్‌ఛార్జ్‌లకు అవకాశాలుండవు. కొన్ని స్థానాల్లో అభ్యర్థులు తిరిగి ప్ర‌జ‌ల‌ను క‌లిసి వారి స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెడితే గెలిచే పరిస్థితి ఉంది. పార్టీ అధికారంలోకి రాగానే కీలక మార్పులు తీసుకొస్తాం. మంత్రులు పార్టీకి రిపోర్ట్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. పార్టీ అనుబంధ విభాగాలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. పార్టీకి.. ప్రభుత్వానికి గ్యాప్ తగ్గించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం.. అని లోకేశ్ వివ‌రించారు.

జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు చేశానన్న లోకేశ్‌.. ఈసారి వేరొకరికి అవకాశం కల్పిస్తానన్నారు. ఈ తరహాలోనే పార్టీలో 2+1 విధానం రావాలన్నారు. రెండు పర్యాయాలు వరుసగా ఒక పదవిలో ఉన్నవారికి విరామం ఇవ్వాలని లోకేశ్ అభిప్రాయపడ్డారు. 30 నియోజకవర్గాల్లో పార్టీకి సరైన అభ్యర్థుల్ని నియమించాల్సి ఉందన్నారు. మహానాడు తరువాత రెండు పెద్ద కుంభకోణాలు బయట పెట్టబోతున్నానని లోకేశ్ వెల్లడించారు. డబ్బుతోనే రాజకీయం చేయలేమన్న ఆయన.. డబ్బు లేకున్నా కష్టమన్నారు.