ఉద్యోగుల పెన్షన్ వివాదం మళ్ళీ బిగుసుకునేట్లుంది. గ్యారెంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్) విధానం అమలుకు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఇదే సమయంలో ఓల్డ్ పెన్షన్ స్కీం(ఓపీఎస్) మాత్రమే అమలు చేయాలని ఉద్యోగుల సంఘాలు డిమాండ్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రులతో జరిగిన చర్చలు ఫెయిలయ్యాయి. ఓపీఎస్ అమలు సాధ్యం కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంగా ప్రకటించేశారు. ఈ విషయాన్ని గతంలో కూడా సజ్జల ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇటు ప్రభుత్వం అటు ఉద్యోగ సంఘాల మధ్య ఏ రూపంలో కూడా సయోధ్య కుదరటంలేదు. కాబట్టి ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఉపయోగం ఉంటుందని అనుకోవడం లేదు. ఇక్కడ తప్పు రెండువైపులా ఉందన్నది వాస్తవం. అధికారంలోకి వస్తే వారంలోగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం తప్పు. సీపీఎస్ రద్దు విషయంలో ముందు వెనకా చూసుకోకుండా సాంకేతిక, ఆర్థిక సమస్యలపై ఎలాంటి కసరత్తు చేయకుండానే హామీ ఇచ్చేయటం జగన్ తప్పు.
ఇదే సమయంలో 2004 తర్వాత నియమితులైనవారంతా సీపీఎస్ విధానంలోకి వస్తారని తెలిసీ ఆ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్లు చేయటం కూడా తప్పే. 2004కు ముందు నియమితులైన వారికి మాత్రమే ఓపీఎస్ విధానం అమలవుతుంది. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా చేరేవారంతా అప్పటి రూల్సు ప్రకారం నడుచుకోవాల్సిందే తప్ప వేరే దారి లేదు. అంతేకానీ తాము చేరకముందున్న పెన్షన్ నిబంధనలను తమకు వర్తింప చేయాలని డిమాండ్ చేయటం సాంకేతికంగా తప్పే అవుతుంది.
అందుకనే ఇద్దరు కూడా గమనించాల్సిందేమంటే రెండువైపులా తప్పులున్నాయి కాబట్టి మధ్యే మార్గంలో సర్దుబాటు చేసుకుంటే ఇద్దరికీ మంచిది. ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ విధానంలో తమకు ప్రతికూలంగా ఉన్న అంశాలపై ఉద్యోగనేతలు కసరత్తుచేసి వాటిని తమకు అనుకూలంగా మలచుకునేట్లుగా ప్రభుత్వాన్ని ఒప్పిస్తే బాగుంటుంది. లేకపోతే ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాకుండా రావణకాష్టంలాగ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది ఉద్యోగులే కానీ ప్రభుత్వం కాదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates