మినీ మ‌హానాడులు ఊపిరి పోస్తాయా ?

ప‌సుపు దండు క‌ద‌లివ‌స్తోంది. జిల్లాల‌లో మినీ మ‌హానాడులు పార్టీకి కొత్త ఊపునూ ఉత్సాహాన్ని ఇస్తాయ‌ని భావిస్తున్నాయి తెలుగుదేశం వ‌ర్గాలు. ఆ విధంగా శ్రేణులు, నాయ‌కులు క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్ప‌టికే బాదుడే బాదుడు పేరిట జ‌రిపిన నిర‌స‌న కార్య‌క్ర‌మాలు అన్నీ హిట్ అయ్యాయి. ఉత్త‌రాంధ్రలో కొత్త ఉత్సాహం వ‌స్తోంది. బాబు కూడా ఇదే ప్రాంతంలో ప‌ర్య‌టించి వెళ్లారు. అటుపై మినీ మ‌హానాడులు కొన్నింట జ‌రిగాయి. ఇవ‌న్నీ కూడా నాయ‌క‌త్వానికీ, శ్రేణుల‌కూ మ‌ధ్య ఉన్న అంత‌రాలు తొల‌గిపోయేందుకు స‌హ‌క‌రిస్తే మేలు అన్న‌ది ఓ వాద‌న వినిపిస్తోంది.

ముఖ్యంగా ప‌ట్టు కోసం, ఉనికి కోసం, మ‌నుగ‌డ కోసం జిల్లాల‌లో నాయ‌కులు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఉనికి ఈ సారి ప్ర‌శ్నార్థ‌కం అయితే ఇక‌పై రాజ‌కీయం సాగించ‌డం క‌ష్ట‌మే అన్న అంచ‌నాకు వ‌చ్చారు. అదే ఇవాళ వారిని మ‌రింత బాగా ప‌నిచేసేందుకు కార‌ణం అవుతోంది. చింత‌మనేని లాంటి లీడ‌ర్లు కూడా ఇప్పుడిప్పుడే పార్టీ యాక్టివిటీస్ బాగున్నాయ‌ని అంటున్నారు. అదేవిధంగా ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుగుణంగా మార్చుకునేందుకు వీలున్న అన్ని అవ‌కాశాలు వాడుకోవాల‌నిచూస్తున్నారు.

ఇదంతా బాగున్నా వైసీపీ వ‌ర్గాల బ‌లం ముందు టీడీపీ నెగ్గుతుందా అన్న సందేహం కూడా వ‌స్తోంది. ముఖ్యంగా పార్టీ కార్య‌క‌లాపాలు స్పీడప్ అయిన‌ప్పుడే ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ ని తెర‌పైకి తెస్తున్నారు. దీంతో చాలా మంచి విష‌యాలు జనాల‌కు చెప్పాల‌నుకుంటున్న విష‌యాలు కూడా ప‌క్క‌దోవ ప‌ట్టిపోతున్నాయి. ఇష్యూ డైవ‌ర్ష‌న్ లేకుండా ఉంటే తాము కూడా బాగా పనిచేయ‌గ‌ల‌మ‌ని అంటున్నారు.

అయితే ఇదే స‌మ‌యంలో లోకేశ్ చెబుతున్న విధంగా కేసులు లేక‌పోతే కార్య‌క‌ర్త‌లు ప‌నిచేయ‌లేద‌ని తాము భావిస్తామ‌ని అన‌డం భావ్యంగా లేద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ప్రజా పోరులో కొంత వృద్ధి సాధించామ‌ని,నాయ‌కులు ప్రోత్స‌హిస్తే ఇంకాస్త ప‌నిచేయ‌డం సాధ్య‌మ‌ని కూడా వీళ్లంతా అంటున్నారు. అంతరాలు తొలగించుకుని ఐక్యంగా పనిచేస్తే ఫ‌లితం సాధించ‌డం అంత కష్టం కాదంటున్నాయి శ్రేణులు. టీడీపీ నాయ‌కులంతా ఏక‌మై పోరుబాట‌లో న‌డిస్తే విజ‌యం త‌థ్యం అన్న‌ది పార్టీ అభిమానుల మాట !