దేశంలో త్వ‌ర‌లోనే ఓ సంచ‌ల‌నం జ‌రుగుతుంది: కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే ఓ సంచ‌ల‌నం జ‌రుగుతుంద‌ని అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌, కేజ్రీవాల్లతో చర్చలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “రాజకీయ నేతలు కలిసినప్పుడు రాజకీయాలే మాట్లాడుతాం. దేశంలో ఒక సంచలనం జరగాల్సి ఉంది, జరిగి తీరుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అందరూ చూస్తారు.” అంటూ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి దిల్లీలోని మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను కేసీఆర్ పరిశీలించారు. కేజ్రీవాల్‌ స్వయంగా కేసీఆర్‌కు సర్వోదయ పాఠశాలను చూపించారు. అనంతరం అక్కడి సిబ్బంది పాఠశాల ప్రత్యేకతలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, సదుపాయాలను కేసీఆర్‌కు వివరించారు. పాఠశాలలో అధునాతనంగా అందుతున్న వసతుల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులకు సంబంధించిన వీడియోలను కేసీఆర్ బృందం వీక్షించిన కేసీఆర్… విద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వ విధానం ప్రశంసనీయమని కొనియాడారు.

“కేజ్రీవాల్ ప్రభుత్వం పాఠశాలలను బాగా తీర్చిదిద్దింది. దిల్లీ పాఠశాలల గురించి గతంలో టీవీల్లో చూశాను. ఇప్పుడు ప్రత్యక్ష్యంగా చూశాను. కేజ్రీవాల్‌ తన సొంత విధానాలతో పాఠశాలలను అభివృద్ధి చేశారు. తెలంగాణ ఉపాధ్యాయులు, సంఘాల ప్రతినిధులను ఢిల్లీ పాఠశాలలకు పంపిస్తాం. బోధనా విధానాలను అధ్యయనం చేయాలని చెప్తాం. బోధనా విధానాలు దేశం మొత్తానికి ఆదర్శనీయం. తెలంగాణలోనూ ఇదే విధంగా బడులను అభివృద్ధి చేస్తాం. ఒక రాష్ట్రంలో జరుగుతున్న మంచి పథకాలను.. మరో రాష్ట్రం స్వీకరిస్తూ ముందుకు వెళ్లాలి. ఇలా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తే.. దేశం అభివృద్ధి చెందుతుంది.” అన్నారు.

అంతకుముందు.. ఢిల్లీలోని తన నివాసంలో యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. రెండు గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు.. దేశంలోని తాజా పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు, ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఆదివారం 18 కోట్లు పంపిణీ
ఆదివారం మధ్యాహ్నం డిల్లీ నుంచి చండీగఢ్‌కు వెళ్లనున్న కేసీఆర్.. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్లతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొంటారు.