ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనపై టీడీపీ సీనియర్ నేత, శాసన మండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ దావోస్కు వెళ్లడానికి మాత్రమే సీబీఐ కోర్టు అనుమతి ఉందా? లండన్ వెళ్లేందుకూ అనుమతించిందా..? అన్నదానిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ లండన్ వెళ్లేందుకు సైతం అనుమతిస్తే.. అధికార పర్యటనలో ఎందుకు చేర్చలేదో చెప్పాలని నిలదీశారు. షెడ్యూల్లో లేని లండన్లో ఎందుకు ల్యాండ్ అయ్యారో రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. ఒకవేళ సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వకపోయినా జగన్ రెడ్డి లండన్ వెళ్తే… అది కోర్టు ధిక్కరణే అవుతుందన్నారు.
అనుమతివ్వకపోయినా జగన్ రెడ్డి లండన్ వెళ్లడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఉందా…లేక దావోస్‌కు వెళ్లేందుకు మాత్రమే అనుమతించిందా అని ప్రశ్నించారు. కోర్టు అనుమతితో విదేశీ పర్యటనలకు వెళ్లే పరిస్థితి దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేదన్నారు. సీబీఐ కోర్టు అనుమతి…. దావోస్ సమావేశంలో చూపించటం రాష్ట్రానికి అప్రదిష్ట కాదా అని అన్నారు.
రాష్ట్ర బృందం మొత్తం ఒకే విమానంలో వెళ్లకుండా ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో వెళ్లడాన్ని యనమల తప్పుబట్టారు. అధికారులను వదిలేసి భార్య, మరొకరితో మాత్రమే సీఎం ప్రత్యేకంగా వెళ్లడం లోగుట్టు ఏమిటని నిలదీశారు. సొంత, రహస్య పనులకు ప్రజాధనం దుర్వినియోగం చేస్తారా..? అని ప్రశ్నించారు. దావోస్కు అధికార యంత్రాగానిది ఒక దారి… సీఎం దంపతులది మరో దారా..? అని అడిగారు. స్పెషల్ ఫ్లైట్కు ఒక ఖర్చు, కమర్షియల్ ఫ్లైట్కు మరో ఖర్చు చేయాల్సిన అవసరం ఏంటన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంపై ఇది అదనపు భారం కాదా..? అని నిలదీశారు.
ఇలా కోర్టు అనుమతితో విదేశీ పర్యటనలకు వెళ్లే పరిస్థితి దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా గతంలో వచ్చిందా యనమల దుయ్యబట్టారు. ఇది రాష్ట్రానికి అప్రదిష్ట కాదా..? అని ప్రశ్నించారు. 3ఏళ్ల తర్వాత దావోస్ వెళ్లడం… రాష్ట్రం కోసమా, అక్రమార్జన నల్లధనం తరలింపు కోసమా… అని యనమల నిలదీశారు. అధికారులను వదిలేసి సీఎం, ఆయన భార్య వెళ్లడం వెనుక లోగుట్టు ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దండుకున్న సంపద దాచుకోడానికే లండన్ వెళ్లారనే అనుమానం ప్రజల్లో ప్రబలంగా ఉందన్న ఆయన.. జగన్ లండన్ రహస్య పర్యటన వెనుక లోగుట్టును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బయట పెట్టాలని డిమాండ్ చేశారు.