తెలుగుదేశం పార్టీ అధినేత మెల్లమెల్లగా అభ్యర్ధులను ప్రకటించేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్ధులను ఇప్పటినుండే రెడీ చేస్తున్నారు. ఇంతముందుగా అభ్యర్ధులను ప్రకటించటం నిజానికి చంద్రబాబు మనస్తత్వానికి విరుద్ధం. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికతో తన పద్దతిని మార్చుకున్నారు. అప్పట్లో కూడా లోక్ సభ ఉప ఎన్నికలకు సుమారు నాలుగు మాసాలకు ముందే అభ్యర్ధిని ప్రకటించేసిన విషయం తెలిసిందే.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇపుడు మొదలైన బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో డోన్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధిగా ధర్మవరం సుబ్బారెడ్డిని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి, వైసీపీ అభ్యర్ధి బుగ్గన రాజేంద్రనాధరెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. నేతలు, కార్యకర్తలంతా సుబ్బారెడ్డికి మద్దతుగా నిలబడాలని, టీడీపీని మంచి మెజారిటితో గెలిపించాలని పిలుపిచ్చారు.
గతంలో కడప జిల్లాలోని పులివెందుల అభ్యర్ధిగా బీటెక్ రవి, చిత్తూరు జిల్లా పుంగనూరు అభ్యర్ధిగా చల్లా బాబును ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇలా ముందుగా అభ్యర్ధులను ప్రకటించటం వల్ల ప్లస్సు, మైనస్ రెండూ ఉంటాయి. ప్లస్సు ఏమిటంటే అవసరమైనంత ఆర్ధిక, అంగ బలాలను సమకూర్చుకోవటానికి కావాల్సినంత సమయముంటుంది. తీరుబడిగా ప్రచారం చేసుకోవచ్చు. నియోజకవర్గంలోని అన్నీ గ్రామాలను, వీలైనంత ఎక్కువమంది జనాలను కలవచ్చు. తనకు ప్రత్యర్ధులైన నేతలతో సయోధ్య చేసుకునేందుకు సమయం ఉంటుంది.
ఇదే సమయంలో మైనస్సులు ఏమిటంటే అభ్యర్ధి అంటే పడని వాళ్ళు ప్రస్తుతానికి కామ్ గా ఉన్నా చివరకు వచ్చేసరికి దెబ్బకొట్టడానికి ప్రత్యర్ధులకు సమయం దొరుకుతుంది. అభ్యర్ధితో పడని నేతలు సమయం చూసుకుని పార్టీ మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అభ్యర్థి ప్రత్యర్ధులంతా ఏకమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్లస్సులు, మైనస్సులు ప్రతిపార్టీలోని అభ్యర్థులకు వర్తిస్తుంది. ఇంత చిన్న విషయం చంద్రబాబుకు తెలీకుండా ఏమీ ఉండదు. అయినా ప్రకటించారంటే సీనియర్ నేతలు, అభ్యర్థితో చర్చించిన తర్వాతే ప్రకటించుంటారు. కాబట్టి ఎన్నికల్లో ఏమి జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates