గడపగడపకూ మన ప్రభుత్వం పేరిట వైసీపీ చేపట్టిన కార్యక్రమం మధ్యలోనే ఆగిపోనుంది అన్న వార్త ఒకటి వెలుగు చూస్తోంది.ఎందుకంటే రెండు నెలల పాటు పార్టీ నాయకులను క్షేత్ర స్థాయిలో ఉంచి ఇంటింటి సర్వే చేయించినా ఫలితాలు ఆశాజనకంగా రావని తేలిపోయిందని, వాస్తవాలు మాట్లాడే ప్రజల దగ్గర తరుచూ అవమానాలే ఎదురవుతున్నాయని వైసీపీ పెద్దలు భావిస్తున్నారని టీడీపీ అంటోంది. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు లేనేలేవని తేలిన నిమిషాన విపక్షం దాడులు కూడా విపరీతం అవుతున్నాయి. ఇవి కూడా ఓ కారణం కావొచ్చు. కొన్ని చోట్ల సీఎం చెప్పినా సరే స్థానిక ప్రజాప్రతినిధులు సహనం కోల్పోయి మాట్లాడడం కూడా వివాదాలకు తావిస్తోంది.
ప్రజా సమస్యలపై ముఖ్యంగా పథకాలపై అవగాహన లేకుండా కొందరు మాట్లాడితే, మరికొందరు మాత్రం తమకు ఇబ్బంది కలగని చోటుకు వెళ్లి ఫొటోలకు ఫోజులిచ్చి వచ్చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల సీనియర్ నాయకులను పార్టీ గుర్తించి మంత్రి వర్గంలో తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. వాళ్లంతా స్థానిక వ్యతిరేకతను తాము తట్టుకోలేమని అనుచర వర్గాలతో తేల్చి చెప్పారు. ఇందుకు శ్రీకాకుళం జిల్లానే పెద్ద ఉదాహరణ.
రెవెన్యూ మంత్రి ధర్మాన ఇప్పటిదాకా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనలేదు. వ్యక్తిగత పనులపై హైద్రాబాద్ కు వెళ్లి నిన్ననే తిరిగివచ్చారు. ఇకపై ఆయన క్షేత్ర స్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇస్తారో లేదో కూడా తెలియడం లేదు. ఇక నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా తరుచూ వివాదాల్లో ఉంటున్నారు. పథకాలకు సంబంధించి ఆసరా కూ చేయూత కూ తేడా కూడా తెలియడం లేదని టీడీపీ ఇప్పటికే పలు మార్లు అంబటిని ట్రోల్ చేసింది.
ఇదేవిధంగా విశాఖ నేతలు కూడా ఉన్నారు. సాక్షాత్తూ ఓ ఎస్సై పై చిందులు తొక్కారు మాజీ మంత్రి అవంతి శ్రీను. ఉత్తరాంధ్రలో బొత్స కూడా ఇప్పటిదాకా గడపగడపకూ అనే కార్యక్రమంలో పెద్దగా యాక్టివ్ కాలేదు. దాసన్న (మాజీ డిప్యూటీ సీఎం) వెళ్తున్నా కూడా స్థానిక సమస్యలు ఎవ్వరు చెప్పినా దాటవేత ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇక ఇదే ఉత్తరాంధ్రకు చెందిన యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు అయితే మా ఊరికి రోడ్డు వేయండి అని అడిగితే డబ్బుల్లేవు నేనెక్కడి నుంచి తెచ్చేది నేనేమయినా దేవుడి కొడుకునా అని ఎదురు ప్రశ్నించి ఆడియో టేపుల రూపంలో దొరికిపోయారు. ఇవన్నీ చూశాకే బీసీ మంత్రులతో బస్సు యాత్రకు జగన్ ప్లాన్ చేశారన్నది టాక్.