మ‌హానాడు ఎఫెక్ట్‌.. వైసీపీ మాస్ట‌ర్ ప్లాన్ ఏం చేస్తోందంటే!

ముఖ్యమంత్రి జగన్‌ కేబినెట్‌లోని మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు బస్సు యాత్ర చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. విశాఖ నుంచి మంత్రుల బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో బస్సు యాత్ర కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ బ‌స్సు యాత్ర వెనుక టీడీపీ మ‌హానాడును దెబ్బ‌కొట్టే వ్యూహం ఉంద‌ని.. ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించేందుకే ఇలా చేస్తున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

టీడీపీకి దెబ్బేయ‌డ‌మేనా?

టీడీపీ మహానాడు దెబ్బకు వైసీపీలో కలవరం మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు యాత్రలకు భారీ ప్రజాస్పందనతో వైసీపీ సర్కార్ పోటీ యాత్ర చేస్తోంది. సామాజిక న్యాయం పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రుల బస్సు యాత్రకు ఉపక్రమించారు. ఈనెల 26 నుంచి నాలుగు రోజుల పాటు వరుసగా బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మంత్రుల బస్సు యాత్రపై వైసీపీలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. గడపగడపకు కొనసాగుతున్నందున బస్సు యాత్ర ఎందుకని పార్టీలో మరోవర్గం ప్రశ్నిస్తోంది.

అదేస‌మ‌యంలో గడపగడప ప్ర‌భుత్వం కార్యక్రమంలో ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చేందుకే బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు సమాచారం. సభల ఏర్పాటు, బస్సు రూట్ మ్యాప్‌పై వైసీపీ అధిష్టానం సమా వేశం అయింది. ఈ భేటీకి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓ అధికారులు హాజర‌య్యారు. బస్సు యాత్రపై మరింత స్పష్టత వచ్చింది. మరోవైపు జిల్లాకు ఒక బీసీ సదస్సు నిర్వహించాల‌ని వైసీపీ ప్రభుత్వం నిర్ణ‌యించింది. ఇవి కూడా అదే స‌మ‌యంలో నిర్వ‌హించాల‌ని ఆదేశించింది.