టీఆర్ఎస్ రాజ్య‌స‌భ సభ్యులు వీరే..

రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులపై టీఆర్ఎస్‌ కసరత్తు కొలిక్కివచ్చింది. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. రాజ్యసభ అభ్యర్థులుగా హెటిరో సంస్థ‌ల‌ ఛైర్మన్ డాక్టర్. బండి పార్థసారథి, ఖమ్మం జిల్లా గ్రానైట్‌ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), ‘నమస్తే తెలంగాణ’ పత్రిక సీఎండీ దీవకొండ దామోదర్‌ రావును ఎంపిక చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాశ్‌ స్థానం కోసం జరగనున్న ఉపఎన్నికకు ఈ నెల19తో నామినేషన్ల గడువు ముగియనుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్… రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు.

తెలంగాణకు సంబంధించి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా మూడు స్థానాలనూ టీఆర్ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకోవడం లాంఛనమే. కాగా, ఇందులో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దీనికి నోటిఫికేషన్‌ ఇప్పటికే జారీ అయింది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 19తో గడువు ముగుస్తోంది. మిగిలిన రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్‌ ఈనెల 24న జారీ కానుంది. రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఉప ఎన్నిక జరిగే స్థానానికి నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉంది.

డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానంలో ఎన్నికలకు ఈనెల 24 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఒకేసారి ముగ్గురు అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రకటించారు. మూడుస్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై కొన్ని రోజులుగా కేసీఆర్ ముమ్మర కసరత్తు చేశారు. మూడుస్థానాల కోసం సుమారు పది మందికి పైగా ఆశించినా… సీఎం కేసీఆర్.. వీరివైపే మొగ్గుచూపారు. వీరిలో ఇద్ద‌రు పారిశ్రామిక వేత్త‌లు.. బండి పార్థ‌సార‌థి, వ‌ద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. మ‌రొక‌రు అధికార పార్టీ ప‌త్రిక ఎండీ ఉన్నారు.