వైసీపీ నేతల్లో పెరిగిపోతున్న టెన్షన్

ఒక్కసారిగా అధికార పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడమే. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్ధానాలకు ఎన్నిక జరగబోతున్నట్లు కమీషన్ తాజా నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. జూన్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. ఇందులో ఏపీలో 4, తెలంగాణాలో రెండు స్ధానాలున్నాయి.

ఏపీలో ఖాళీ అవబోయే నాలుగు  స్ధానాల్లో ఒకదానిని విజయస్ధాయిరెడ్డికి రెన్యువల్ చేయబోతున్నట్లు ఎప్పటినుండో ప్రచారం జరుగుతోంది. మరి మిగిలిన మూడు స్ధానాలను ఎవరికి కేటాయిస్తారనే విషయంలోనే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే మూడు స్ధానాల్లో తమను ఎంపిక చేయాలంటు చాలామంది నేతలు జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. ఎవరికి వారుగా జగన్ను కలసినపుడు తమ బయోడేటాలను అందిస్తున్నారు.

అయితే భర్తీ చేయబోయే  మూడుస్ధానాల్లో జగన్ సామాజికవర్గాలను కచ్చితంగా పరిశీలిస్తారనే టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు జరుగుతున్న విధానాన్ని చూసిన తర్వాత ఈ విషయంలో వాస్తవముందని నేతల మధ్య చర్చ జరుగుతోంది. అందుకనే బీసీ, ఎస్సీ, మైనారిటి, మహిళా నేతల మధ్య పోటీ పెరిగిపోతోంది. ఈ విషయం ఇలాగుండగానే కార్పొరేట్ దిగ్గజం అదానీ కంపెనీల చైర్మన్ గౌతమ్ అదానీ భార్యకు ఒక టికెట్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. అయితే కాదు కాదు భార్యకు కాదు ఆయన ఇద్దరు కొడుకుల్లో ఒకరికి ఖాయమంటు మరో ప్రచారం జరుగుతోంది.

ఇదే సమయంలో తెలంగాణాకు చెందిన మైహోం అధినేత  జూపల్లి రామేశ్వరరావుకు ఒక స్ధానం ఖాయమైందనే ప్రచారం మొదలైంది. అదానీ కుటుంబానికి ఒకటి, జూపల్లికి మరొకటి రిజర్వు అయితే ఇక మిగిలేది కేవలం ఒక్క  స్ధానం మాత్రమే. జరుగుతున్న ప్రచారాల్లో ఏది నిజమో అర్ధంకాక పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. జగన్ ఓపెన్ గా ఎవరితోను మాట్లాడటం లేదు, వివరాలు చెప్పటం లేదు, అలాగని డైరెక్టుగా జగన్నే అడిగేంత సాహసం నేతలు చేయలేకపోతున్నారు. దాంతో రాజ్యసభ సభ్యత్వాలు ఆశిస్తున్న నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.