`సంకీర్ణం` ఫార్ములా.. బాబు మారుస్తారా?  

2024లో వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో క‌లిసి అడుగులు వేయాల‌ని.. జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ ప్ర‌భుత్వాన్ని దింపేయాల‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఇప్ప‌టికే ఆయ‌న త్యాగాలు.. పొత్తులు.. అంటూ కామెంట్లు  చేస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ నేత‌ల‌ను కూడా ఆయ‌న మాన‌సికంగా సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు.. క‌లిసివ‌చ్చే పార్టీలు.. అంటూ.. ఆయ‌న ప్ర‌క‌ట‌న కూడా చేశారు. ఇప్ప‌టికేజ‌న‌సేన పార్టీ టీడీపీతో పొత్తుకు రెడీ అవుతున్న సంకేతాలు వ‌స్తున్నాయి.

మిగిలిన పార్టీల‌ను చూస్తే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చెప్పిన‌ట్టు వినే.. బీఎస్పీ(కొన్ని జిల్లాల్లో ఉంది), సీపీఐ, సీపీఎంలు.. ఈ సంకీర్ణంలో భాగం అయ్యే అవ‌కాశం ఉంది. ఇక‌, మ‌రోపార్టీ బీజేపీ. ఇది చంద్ర‌బాబు తో జ‌ట్టు క‌ట్టేందుకు స‌సేమిరా అంటున్న పరిస్థితి. ఎందుకంటే.. గ‌తంలో మోడీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా.. పార్ల‌మెంటులో చ‌ర్చ‌కు టీడీపీ సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యానికి తోడు మోడీని వ్య‌క్తిగ‌తంగా కూడా చంద్ర‌బాబు విమ‌ర్శించారు. దీంతో బీజేపీ.. టీడీపీ అంటేనే మండి ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ టీడీపీతో క‌లిసి ముందుకు సాగే ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌చ్చు.

అయిన‌ప్ప‌టికీ.. బీజేపీని సైతం.. తాను పొత్తుల‌కు అంగీక‌రించేలా చేస్తాన‌ని.. ప‌వ‌న్ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. దీంతో ఏం జ‌రుగుతుంద‌నేది.. ఆస‌క్తిగా మారింది. ఇదిలావుంటే.. అస‌లు సంకీర్ణం పెట్టుకుని.. ఎన్నిక‌ల‌కు వెళ్తే.. చంద్ర‌బాబుకు క‌లిసి వ‌చ్చిన సంద‌ర్భాలు ఉన్నాయా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. గ‌తంలో 2009లో ఉమ్మ‌డి రాష్ట్రంలో చంద్ర‌బాబు అప్ప‌టి వైఎస్ ను గ‌ద్దెదిపేందుకు క‌మ్యూనిస్టులు, టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని మ‌హా సంకీర్ణంగా ఏర్ప‌డి.. పోటీ చేశారు. కానీ.. ఓడిపోయారు.

త‌ర్వాత‌.. 2018లో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో.. కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టులు.. చిన్నా చిత‌కా పార్టీల‌తో పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కువెళ్లి.. అక్క‌డ కూడా ఫెయిల‌య్యారు. ఎటొచ్చీ.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్ర‌మే చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారు. 2014లో బీజేపీ, జ‌న‌సేన‌తో క‌లిసి.. ఏపీలో పోటీ చేసి.. అధికారంలోకి వ‌చ్చారు. సో.. ఇప్పుడు ఈ ప‌రిస్థితిని విశ్లేషిస్తే.. చంద్ర‌బాబు బీజేపీతో క‌లిసి పోటీ చేయ‌క‌పోతే..ఏమేర‌కు విజ‌యం ద‌క్కించుకుంటార‌నేది ఆస‌క్తిగా మారింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న సంకీర్ణం ఫార్ములాను మారుస్తారా?  లేక పాత‌త‌ర‌హాలోనే ముందుకు సాగుతారా.. అనేది చూడాలి.