వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ పోటా పోటీ వ్యూహం.. రిజ‌ల్ట్ ఏంటి…?

ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య పోటా పోటీ వ్యూహాలు తెర‌మీదికి వ‌చ్చాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎవ‌రి వ్యూహాలు వారివే అన్న‌ట్టుగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పుడు.. మాత్రం వ్యూహానికి ప్ర‌తివ్యూహం అన్న‌ట్టుగా.. ప‌రిస్థితి మారిపోయింది. ఈ విష‌యంలో వైసీపీ తాజాగా వేస్తున్న అడుగులు.. టీడీపీ చేస్తున్న వ్య‌తిరేక ప్ర‌చారానికి చెక్ పెడుతుందా? అనే చ‌ర్చ కూడా సాగుతోంది. ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వం.. ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేస్తోంది. ఈ సంక్షేమ కార్య‌క్ర‌మాలే.. త‌మ‌ను మ‌ళ్లీ గెలిపి స్తాయ‌ని.. వైసీపీ ఆశ‌లు పెట్టుకుంది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌నే క‌సితో టీడీపీ ముందుకు సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీకి చెక్ పెట్టేందుకు అంత‌ర్లీనంగా టీడీపీ ప్ర‌చారం చేస్తోంది. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రిగేలా.. వ్యూహాత్మ‌కంగా పార్టీ నేత‌ల‌ను పుర‌మాయించింది. అంటే.. వీరు పార్టీలో ఉన్నప్ప‌టికీ.. పార్టీ నేత‌లుగా ఉండ‌రు. కానీ, ప్ర‌జ‌ల్లో మాత్రం తిరుగుతుంటారు. ప్ర‌జ‌ల్లో తిరుగుతూ.. ప‌థ‌కాల‌పై వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తారు. దీనికి టీ బ‌డ్డీలు కావొచ్చు.. బ‌స్సులు కావొచ్చు రైల్వే స్టేష‌న్లు కావొచ్చు.. ఎక్క‌డ న‌లుగురు పోగు ప‌డితే.. అక్క‌డ‌కు వీరు చేరిపోయి.. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, సంక్షేమ ప‌థ‌కాలు,.. రాష్ట్ర అభివృద్ది వంటి అంశాల‌పై బాహాటంగానే చ‌ర్చ లేపుతారు.

ఈ క్ర‌మంలో బాహాటంగానే .. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తారు. ఫ‌లితంగా.. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల మైండ్ లో ప్ర‌భుత్వంపై ఎలాంటి ఆలోచ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ.. వీరి చ‌ర్చ‌తో.. సంక్షేమ ప‌థ‌కాల మాట ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. రాష్ట్ర అభివృద్ధి చెంద‌డం లేద‌ని.. అమ‌రావ‌తి ముందుకు సాగ‌డం లేద‌ని.. మూడు రాజ‌ధానులు కూడా వేస్ట్ అని చ‌ర్చ చేస్తారు. దీంతో అక్క‌డున్న ప్ర‌జ‌ల‌కు అప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్పై ఎలాంటి అభిప్రాయం ఉన్న‌ప్ప‌టికీ.. వీరి మాట‌ల‌తో ఆలోచ‌న‌లో ప‌డ‌తారు. చంద్ర‌బాబు స‌హా టీడీపీనే బెట‌ర్ అని.. ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేస్తారు. ఇప్పుడు జ‌రుగుతున్న ట్రెండ్ ప్ర‌చారం.. రాజ‌కీయ నేత‌లు అనుస‌రిస్తున్న వ్యూహాలు ఇవే.

ఒక‌ప్పుడు క‌మ్యూనిస్టుల‌కు మాత్ర‌మే ఇలాంటి ప్ర‌చారాలు అమ‌లు చేసేవ‌ని ఉండేది. కొంద‌రు మావోయిస్టులుగా మారి ఆయుధాలు చేప‌ట్టి.. అడ‌వుల్లోకి వెళ్లిపోతే.. మ‌రికొంద‌రు బ‌య‌ట ఉండి.. క‌మ్యూనిస్టులుగా అవే సిద్ధాంతాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేవారు. ఇటీవల కాలంలో ఇదే త‌ర‌హా ప్రచారాన్ని బీజేపీ కూడా న‌మ్ముకుంది. చాయ్ పే చ‌ర్చ‌.. అంటూ.. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా కొంద‌రు బీజేపీ అనుకూల వాదులు చేరి చ‌ర్చించ‌డం.. మిగిలిన వారిని కూడా లాగ‌డం.. అనేది వ్యూహం. ఇప్పుడు టీడీపీ కూడా ఇదే త‌ర‌హా వ్యూహం చేస్తోంది. అందుకే ఇటీవ‌ల కాలంలో ఎక్క‌డ చూసినా.. ప్ర‌భుత్వ వ్యతిరేక చ‌ర్చ ఎక్కువ‌గా జ‌రుగుతోంది.

అయితే.. ఇప్పుడు టీడీపీ చేస్తున్న ఈ వ్యూహానికి వైసీపీ త‌న‌దైన శైలిలో చెక్ పెడుతోంది. టీడీపీ నేత‌లు ఎక్క‌వ స‌మావేశాలు పెట్టినా.. ఎక్క‌డ మీటింగులు పెట్టినా.. ఆ నాయ‌కులు ఎలాంటి విమ‌ర్శ‌లు చేసినా.. వెంట‌నే కొంద‌రు రియాక్ట్ అవుతారు. వారికి నేరుగా పార్టీతో సంబంధాలు ఉన్న‌ట్టు అనిపించ‌వు. కానీ, వారు పార్టీ త‌ర‌ఫునే ఉంటారు. ఈ విష‌యం వారు చెప్ప‌రు. బ‌య‌ట‌కు కూడా తెలియదు. కానీ, ప్ర‌జ‌ల త‌ర‌ఫున ఉన్న‌ట్టుగా.. ప్ర‌జ‌ల్లో ఒక‌రుగా ఉంటారు. వెంట‌నే జై జ‌గ‌న్‌.. జై వైసీపీ అనే నినాదాలు.. జోరందుకుంటాయి. ఈ ప‌రిణామం.. టీడీపీని ఒక్క‌సారిగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేస్తుంది.

త‌మ కార్య‌క్ర‌మంలో ఇలాంటి నినాదాలేంట‌ని వారు తేరుకునేలోగా.. ప్ర‌జ‌లు అక్క‌డ నుంచి వెళ్లిపోతారు. తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లాలో చంద్ర‌బాబు పాల్గొన్న స‌మావేశంలో ఇదే జ‌రిగింది. చంద్ర‌బాబు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూ.. ప్ర‌జ‌ల‌తో మాట్లాడుతున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా వెనుక నుంచి.. జై జ‌గ‌న్ అనే నినాదాలు మిన్నుముట్టాయి. దీంతో చంద్ర‌బాబు అర్ధంత‌రంగా.. స‌మావేశం నిలిపివేసి.. అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఇలా.. త్వ‌ర‌లోనే రాష్ట్ర‌వ్యాప్తంగా ఇలాంటి బ్యాచ్‌ల‌ను వైసీపీ మ‌రిన్ని పెంచుతున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో రెండు వ‌ర్గాల‌కు మ‌ధ్య పోరు తారాస్థాయికి చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.