శ్రీలంకలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజపక్స కుటుంబ సభ్యులు దేశం విడిచి పారిపోతున్నారు. అధ్యక్ష గొటబాయ రాజపక్సే, ప్రధానమంత్రి మహేంద్ర రాజపక్సేల రాజీనామాలు డిమాండ్ చేస్తూ జనాలంతా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎంతగా డిమాండ్ చేస్తున్నా, ఎమర్జెన్సీ విదించినా, ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నా రాజీనామాలు చేసే ప్రసక్తే లేదని ఇద్దరు భీష్మించుకుని కూర్చున్నారు.
దేశం ఏమైపోయినా సరే తాము మాత్రం రాజీనామాలు చేసేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే సోమవారం ఒక్కసారిగా హింసాత్మక ఘటనలు మొదలయ్యాయి. ఆందోళనకారులు మంత్రి సనత్ నిశాంత ఇంటి మీద దాడి చేసి నిప్పుపెట్టారు. దాంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు ముందు భాష్పవాయువు ప్రయోగించి లాభం లేకపోవడంతో కాల్పులు జరిపారు. దాంతో ఇద్దరు పౌరులు చనిపోయినట్లు శ్రీలంక మీడియా చెప్పింది.
ఇదే సమయంలో రెచ్చిపోయిన జనాలు అటుగా వస్తున్న ఒక ఎంపీ కారుపైన దాడిచేశారు. ఎంపీ భద్రతా సిబ్బంది కాల్పులు జరిపినా జనాలు వెనక్కు తగ్గలేదు. పైగా కారుపైన దాడిచేసి ఎంపీని విచక్షణారహితంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ఎంపీ ఆత్మహత్య చేసుకున్నారనే ప్రచారం కూడా మొదలైంది. దేశవ్యాప్తంగా జరిగిన వేర్వేరు ఘటనల్లో సుమారు 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇంత జరిగిన తర్వాత ప్రధానమంత్రి రాజపక్సే రాజీనామా చేశారు. అంతకుముందు ప్రభుత్వ మద్దతుదారులకు జనాలకు మధ్య చాలాచోట్ల పెద్ద గొడవలే జరిగాయి. సరే ఏదేమైనా శ్రీలంకలో ఇన్నిరోజుల ఆందోళనలు, నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. దాదాపు నెలన్నర రోజుల ఆందోళనల తర్వాత ప్రధాని రాజీనామా చేశారు. ఇంకా అధ్యక్షుడు గొటబాయ పదవిని విడిచిపెట్టేది లేదంటున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్న లెక్కేచేయటంలేదు. సరే ఈరోజు కాకపోతే రేపైనా అద్యక్షుడు కూడా రాజీనామా చేయక తప్పేట్లులేదు. మొత్తానికి రాజపక్సే కుటుంబం దేశాన్ని నాశనం చేసేసినట్లు అర్ధమవుతోంది. అందుకనే జనాలు వెనక్కు తగ్గకుండా వాళ్ళ రాజీనామాలకు ఇంతగా పట్టుబడుతున్నది. జనాలాగ్రహం ఏరోజుకు ఎలా మలుపు తిరుగుతుందో తెలీకుండా ఉంది.