హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ముందు కలకలం రేగింది. తపోవన్లోని విధానసభ ప్రధాన ద్వారం వద్ద ఖలిస్థాన్ జెండాలు దర్శనమిచ్చాయి. కొందరు దుండగులు అసెంబ్లీ గేటుకు జెండాలు వేలాడదీయడమే కాకుండా.. గోడలపైనా ఖలిస్థానీ నినాదాలు రాశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని జెండాలను తీసివేశారు. శనివారం అర్ధరాత్రి లేదా ఆదివారం ఉదయం ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్ తపోవన్లోని అసెంబ్లీపై ఖలిస్థాన్ జెండాలు ప్రత్యక్షమయ్యాయి. ఎవరో దుండగులు.. విధానసభ గేటుకు, గోడలకు జెండాలు అంటించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై సీరియస్గా స్పందించిన సీఎం జైరాం ఠాకుర్ దీనిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
అసెంబ్లీ గేటు ముందు సీసీటీవీ లేకపోవడం గమనార్హం. అయితే.. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. గత మార్చిలో సిఖ్ ఫర్ జస్టిస్ అధ్యక్షుడు గురుపత్వంత్ సింగ్.. ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్కు బెదిరింపు లేఖ రాశారు. శిమ్లాలో ఖలిస్థాన్ జెండాలు ఎగురవేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో ఇది వీరి పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనను ఖండించారు సీఎం జైరాం ఠాకుర్. ఇదో పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దీనిపై దర్యాప్తు జరిపి.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ట్వీట్ చేశారు. ఈ విధానసభలో కేవలం శీతాకాల సమావేశాలే జరుగుతాయని, భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇతర రాష్ట్రాలతో సరిహద్దుల్లో భద్రతకు సంబంధించి త్వరలో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జెండాలను పంజాబ్ నుంచి వచ్చిన ఉగ్రవాదులేనని పెట్టి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates