సోషల్ మీడియాలో మోడీ సరికొత్త రికార్డు!

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను సొంతం చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల్లో ఇంత భారీ సంఖ్యలో ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఏకైక ప్రజానాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మోడీకి వెనుకబడి ఉన్నారు.

ఇక ఇప్పుడు తాజాగా యూట్యూబ్‌లోనూ మోడీ సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నారు. ఏకంగా 3 కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్లను ఆయన సొంతం చేసుకుని ప్రపంచ రికార్డు సాధించారు. ప్రపంచ దేశాల్లో ఇంత భారీ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లను కలిగిన నాయకుడు లేరనేది గమనార్హం. ప్రపంచంలో తామే ముందున్నామని చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కేవలం కోటి మందిలోపే సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్నారు.

ఇక మోడీ సబ్‌స్క్రైబర్ల విషయానికి వస్తే ఆయన గుజరాత్ కంటే కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీ ప్రజలే ఎక్కువగా ఉన్నారు. వీరితో పాటు దక్షిణాదిలోని కర్ణాటక, ఏపీ ప్రజలు కూడా ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అలాగే అమెరికా సహా ఇతర విదేశాలకు చెందిన సబ్‌స్క్రైబర్ల సంఖ్య సుమారు 50 లక్షలకు పైగానే ఉందని తెలుస్తోంది. ఇలా మొత్తంగా 3 కోట్ల మందికి పైగా మోడీ సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకున్నారు.

ఏంటి రీజన్?

2007లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన మోడీ ఇప్పటి వరకు 33 వేలకుపైగా వీడియోలను పోస్టు చేశారు. వీటిలో అధిక భాగం ఆయన ప్రసంగాలే. అయితే శాంతి, ప్రపంచ దేశాల మధ్య సామరస్యము, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు యూట్యూబ్‌లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే పార్లమెంట్ వేదికగా చేసిన ప్రసంగాలను కూడా పొందుపరిచారు. విదేశీ పర్యటనలను ప్యాకేజీ రూపంలో యూట్యూబ్‌లో ఉంచారు. విభిన్న అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయన సబ్‌స్క్రైబర్ల సంఖ్య కోట్లకు చేరింది.