పీకే పాదయాత్రకు మాత్రమే పరిమితమా ?

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) తన రాజకీయ భవిష్యత్తును ఆవిష్కరించారు. మీడియాతో మాట్లాడుతు రాజకీయపార్టీ పెట్టే ఆలోచనేదీ తనకు లేదని స్పష్టంగా ప్రకటించారు. అయితే పనిలోపనిగా పాదయాత్ర మాత్రం చేయబోతున్నట్లు చెప్పారు. జన్ సురాజ్ పేరుతో అక్టోబర్ 2వ తేదీ నుంచి బీహార్ లో సుమారు 3 వేల కిలోమీటర్ల పాదయాత్రకు పీకే రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న జన్ సూరజ్ వేదికే భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే అవకాశాలను వివరించారు. ఇక్కడ విషయం ఏమిటంటే పీకే తొందరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేస్తారనే ప్రచారం విపరీతంగా జరిగింది. అయితే ఆ ప్రచారమంతా కేవలం ప్రచారం మాత్రమే అని తేలిపోయింది. రాజకీయ వ్యూహకర్త స్ధాయి నుండి రాజకీయ నేతగా అవతరించాలని పీకేలో బలమైన ఆకాంక్ష కనబడుతోంది.

అయితే ఆ ఆకాంక్ష ఏదైనా పార్టీలో చేరటం వల్ల నెరవేరుతుందేమో కానీ సొంతంగా పార్టీ పెడితే సక్సెస్ అయ్యే అవకాశాలు మాత్రం తక్కువే. ఎందుకంటే రాజకీయ వ్యూహకర్తలకు జనాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. 24 గంటలూ జనాలతోనే తిరుగుతున్న రాజకీయ నేతలకే ఆదరణ దక్కటం అంతంతమాత్రంగా ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో డైరెక్టుగా పార్టీ పెట్టేసి పెద్ద నేత అయిపోదామని పీకే అనుకుంటే ఫెయిలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

కొంతకాలంగా దేశంలోని అనేక రాజకీయపార్టీలతో కలిసి పీకే పనిచేస్తున్న విషయం తెలిసిందే. తాను పనిచేసిన వారిలో నితీష్ కుమార్, నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి, మమతాబెనర్జీ, స్టాలిన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పీకే ఫెయిల్యూర్లు కూడా ఉన్నాయి. అయితే ఫెయిల్యూర్ కన్నా సక్సెస్ రేటు ఎక్కువగా ఉంది. దాంతో తనపై తనకు బాగా నమ్మకం పెరిగిపోయినట్లుంది. అందుకనే రాజకీయ వ్యూహకర్త అనేకన్నా రాజకీయ నేతల వాసనలే ఎక్కువైపోయాయి. సరే ఏదేమైనా చివరి నిముషంలో వాస్తవాలు గ్రహించినట్లున్నారు. అందుకనే ప్రస్తుతానికి పాదయాత్రకు మాత్రమే పరిమితమైపోదామని డిసైడ్ అయ్యారు.