కొద్ది రోజులుగా ఏపీలో వరుస గ్యాంగ్ రేప్ ఘటనలు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, పదో తరగతి పరీక్షల పేపర్లు వరుసగా లీక్ అవుతున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే టెన్త్ పేపర్ల లీక్ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. పదో తరగతి పరీక్ష పేపర్లను నారాయణ, చైతన్య స్కూల్ నుంచి లీక్ చేయించారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ రెండు పేపర్లు నారాయణ స్కూల్ నుంచి లీక్ అయ్యాయని, మూడు పేపర్లు శ్రీచైతన్య స్కూల్ నుంచి లీక్ అయ్యాయని జగన్ షాకింగ్ ఆరోపణలు చేశారు.
వీళ్ళే పేపర్ లీక్ చేసి ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారని జగన్ అన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా ప్రచారం చేశారని.. వాట్సాప్ ద్వారా పేపర్లను బయటకు పంపి భయాందోళనలకు గురి చేయాలని చూశారని జగన్ విమర్శలు గుప్పించారు. పేపర్ లీకులపై కొందరు దొంగ నాటకాలు ఆడుతున్నారని, నారాయణ స్కూల్ ఎవరిదో తాను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని అన్నారు. ఆ స్కూల్ టీడీపీ నేతది కాదా అని జగన్ ప్రశ్నించారు. తమకు అనుకూలంగా ఉన్న స్కూళ్ల నుంచే టెన్త్ పరీక్ష పత్రాలను వాట్సాప్ ద్వారా లీక్ చేయిస్తోంది టీడీపీనే అని ఆరోపించారు.
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో, గుంటూరు, విశాఖలో జరిగిన అత్యాచార ఘటనల్లో నిందితులందరూ టీడీపీకి చెందిన వారేనంటూ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ నిందితుల గురించి చంద్రబాబుకు మద్దతు పలికే మీడియా సంస్థలు రాయబోవని.. ఆ ఘటనలను వక్రీకరించి కథనాలు అందిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఎల్లో మీడియా, ఎల్లో పార్టీ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఏడుకొండలవాడిని కోరుకుంటున్నానని జగన్ అన్నారు. టీడీపీ నేతలు గుడులను ధ్వంసం చేస్తే మనం గుడులు కట్టామని.. వాళ్లు రథాలను తగలబెడితే మనం రథాలను నిర్మిస్తున్నామని జగన్ అన్నారు.
గత ప్రభుత్వం బడులు మూసివేద్దామన్న ఆలోచనతో ముందుకు వెళ్లిందని, కానీ తాము నాడు-నేడు పేరుతో పాఠశాలలను పూర్తిగా మార్చివేశామని చెప్పుకొచ్చారు. గత సర్కారు బకాయిలు పెడితే, తామే చెల్లించామని జగన్ వెల్లడించారు. అవినీతికి ఆస్కారం లేని విధంగా తల్లుల ఖాతాల్లోనే డబ్బులు వేస్తున్నామని వివరించారు. గతంలో చంద్రబాబు వసతి దీవెన, నాడు-నేడు వంటివి ఎప్పుడైనా అమలు చేశారా? అంటూ ప్రశ్నించారు. తాము ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఓర్వలేని దొంగల ముఠా పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates