యాదాద్రి పనులు మరీ ఇంత నాసిరకమా ?

ముఖ్యమంత్రి కేసీయార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేయిస్తున్న యాదాద్రి పనుల డొల్లతనం ఒక్కసారిగా బయటపడింది. బుధవారం కురిసిన వర్షానికి ఆలయం లోపలంతా నీళ్ళు నిండిపోయింది. ఆలయానికి వెళ్ళే ప్రధాన రోడ్డు కుంగిపోయింది. ఆలయంలోని గదుల్లోకి, హాళ్ళలోకి కూడా పెద్ద ఎత్తున నీరుచేరిపోయింది. ప్రసాదాలుండే గదులు, భక్తుల క్యూలైన్లు, విశ్రాంతి తీసుకునే గదులు కూడా నీళ్ళతో నిండిపోయింది.

రోజులో కొద్దిసేపు కురిసిన గట్టి వర్షానికే యాదాద్రి లోపలా, బయట పరిస్థితి ఇంత అన్యాయంగా తయారైపోయింది. మండువేసవిలో కురిసిన అకాల వర్షానికే పరిస్థితి ఇలాగైతే ఇక రాబోయే వర్షాకాలంలో పరిస్ధితి ఏమిటి ? వర్షాకాలంలో రెండు రోజులు భారీ వర్షాలు కురిస్తే యాదాద్రి ఆలయం పరిస్థితి ఎంత ఘోరంగా తయారవుతుందో ఊహించటానికే భయంగా ఉంది. అసలు వర్షానికి రోడ్డు నాలుగు అడుగుల లోతులోకి కుంగిపోవటమే విచిత్రంగా ఉంది.

కొద్దిసేపటి వర్షానికే రోడ్డు నాలుగు అడుగుల తోతులోకి కుంగిపోతే కొన్ని గంటలపాటు భారీ వర్షం కురిస్తే మొత్తం రోడ్డు మాయమైపోతుందేమో. కేసీయార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న నిర్మాణ పనుల్లోని డొల్లతనం ఏమిటో వర్షం సాక్షిగా బయటపడింది. కేసీయార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేయిస్తున్న పనులే ఇంత నాసిరకంగా ఏడ్చాయంటే ఇక ఈ పనులను పట్టించుకోకపోయుంటే ఇంకెంత అధ్వాన్నంగా ఉండేవో.

వర్షం కారణంగా జరుగుతున్న పనులు ఎంత నాసిరకంగా జరుగుతున్నాయో బయటపడింది. ఒక్క వర్షానికే పరిస్థితి ఇలాగైపోతే ఎలాగంటూ భక్తులు దిక్కులు చూస్తున్నారు. బయటపడిన పనుల డొల్లతనం కారణంగా కాంట్రాక్టర్లు పనులు ఎంత అధ్వానంగా చేస్తున్నారో బయటపడింది. ఇదే సమయంలో అధికారుల పర్యవేక్షణ ఎంత ఘనంగా ఉందో కూడా ఆధారాలతో సహా ప్రపంచానికి తెలిసింది. మరి పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల మీద, పర్యవేక్షిస్తున్న అధికారులపైన కేసీయార్ ఏమి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. నిజానికి యాదాద్రి పనుల్లోని డొల్లతనాన్ని బయటపెట్టిన వర్షానికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే.