గత కొద్దికాలంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తెలంగాణలో రాజకీయం రూట్ మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్నప్పటికీ తాజాగా నేరుగా స్పందిస్తున్నారు. చోటామోటా నేతలు కాకుండా ఏకంగా ముఖ్య నేతలే కాంగ్రెస్ నాయకుడి పర్యటనను టార్గెట్ చేశారు. అసలు తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ ఎందుకొస్తున్నారో చెప్పాలని సీఎం కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న హీనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని హరీష్ రావు అన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ నేతలు ఎంతకైనా దిగజారుతారన్నారు. తమది బతుకు దెరువు కోసం ఆరాటమని ..కాంగ్రెస్ పార్టీది కుర్చీల కోసం కొట్లాట అని అన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడికి పోతే అక్కడ కాంగ్రెస్ గల్లంతు అవుతుందన్నారు. రాహుల్ బాధ్యత తీసుకున్న తర్వాత జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కంటే తక్కువగా అయ్యిందన్నారు. ఇక్కడి పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో అయినా తెలంగాణలో ఇస్తున్నట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నారా అని మంత్రి హరీష్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ అంటే విత్తనాల కొరత, కరెంట్ కోతలు, ఎరువుల కొరత. రైతుల కష్టాలు, కన్నీళ్లు అని హరీష్ రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సారెస్పీ నీళ్లు రాక పంటలు ఎండి పోయేవని గుర్తు చేశారు. రైతన్నలు అన్నిరకాలుగా అరిగోస పడ్డ పాల అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అని హరీష్ రావు ఆరోపించారు.