చంద్రబాబు- టాటా కల నెరవేరింది!!

ఎస్‌! విజ‌న్ ఉన్న నాయ‌కుడు.. సేవ చేయాల‌నే సంక‌ల్పం ఉన్న టాటా సంస్థ‌. సంయుక్తంగా.. క‌న్న క‌ల‌.. కేన్స‌ర్ ఆసుప‌త్రి. క్యాన్సర్‌ను పూర్తి స్థాయిలో నిర్మూలించే దిశగా వేసిన అడుగులు ఇప్పుడు ఫ‌లించాయి. తిరుపతిలోని జూపార్కు రోడ్డులో టీటీడీ సహకారంతో టాటా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వ ర ఇన్‌స్టిట్యుట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్డ్స్‌ రీసెర్చ్‌ (ఎస్వీఐసీఏఆర్‌) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. క్యాన్సర్‌ బాధితులను దృష్టిలో పెట్టుకుని శ్రీవారి పాదాల చెంత 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో క్యాన్సర్‌ ఆస్పత్రిని నిర్మించడానికి టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ రతన్‌ టాటా శ్రీకారం చుట్టారు.

ఈ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా కృషి చేశారు.. అదేస‌మ‌యంలో టీటీడీ అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో 2018 ఆగస్టు 31న చంద్ర‌బాబు సీఎంగా ‘టాటా’ క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఏడాది కాలంలోనే ఆస్పత్రిని క్యాన్సర్‌ బాధితులకు అందుబాటులోకి తేవాలని చాలా వరకు పనులు పూర్తి చేశారు. అయితే.. అనూహ్య కార‌ణాల‌తో కొంత ఆల‌స్య‌మైంది. త‌ర్వాత వ‌చ్చిన జ‌గ‌న్ ప్రభుత్వం అనుమ‌తుల విష‌యంలో చేసిన జాప్యం.. కొవిడ్‌ వల్ల కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను తలెత్తాయి.

ఎట్టకేలకు ఆస్పత్రి నిర్మాణం పూర్తి కావడం, అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బంది అందుబాటులోకి రావడంతో గురువారం దీనిని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేశంలో క్యాన్సర్‌ను పూర్తి స్థాయిలో నిర్మూలించే దిశగా ఆస్పత్రుల నిర్మాణాలకు రతన్‌ టాటా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే తిరుపతిలో క్యాన్సర్‌ ఆస్పత్రిని నిర్మించారు. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి.. తగిన వైద్యం అందిస్తే, నివారించే అవకాశం ఉంటుందనే ఆలోచనతో క్యాన్సర్‌ రీసెర్చ్‌ కేంద్రాన్ని కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు.

టాటా ట్రస్టు మొత్తం రూ.600 కోట్ల వ్యయంతో క్యాన్సర్‌ వ్యాధి నివారణ దిశగా ఎస్వీఐసీఏఆర్‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది. 376 పడకలు, టెలిరేడియాలజీ, టెలి డయాగ్నోస్టిక్స్‌, రేడియేషన్‌ థెరపీ, అధునాతన క్యాన్సర్‌ పరిశోధన, క్యాన్సర్‌ నిపుణుల కోసం శిక్షణ వంటి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చేలా ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభించారు. రెండు దశల్లో పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించారు. తొలి దశలో చంద్ర‌బాబు హ‌యాంలో దాదాపు రూ.210 కోట్ల వ్యయంతో ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేశారు. అత్యవసర విభాగంలో 10 పడకలను, మరో 82 సాధారణ పడకలతో ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురానున్నారు.

జ‌గ‌న్ ప్ర‌మేయం ఎంత‌?

గురువారం ఈ ఆసుప‌త్రిని ప్రారంభించ‌నున్న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ఈ ఆసుప‌త్రికి ఉన్న సంబంధం ఎంత‌? అనేది చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఆనాడు.. టాటా ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి.. వారిని ఒప్పించింది.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం. పైగా.. వారు బెంగ‌ళూరుకు వెళ్తామంటే.. కాదు.. అని ప‌ట్టుబ‌ట్టి.. ఒప్పించి.. బెంగ‌ళూరుకు స‌మీపంలో ఉంటుంద‌ని తిరుప‌తిని ఎంపిక చేసింది.. టీడీపీ ప్ర‌భుత్వం.

అంతేకాదు.. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, నీరు, విద్యుత్ ఇలా.. అన్ని విష‌యాల్లోనూ సంస్థ‌కు నిక‌ర‌మైన హామీలు ఇచ్చారు. దాదాపు 25 సంవ‌త్స‌రాలు.. నీటిని ఉచితంగా అందించే ఒప్పందం చేసుకున్నారు. అదేవిధంగా స్థ‌లాన్ని అప్ప‌టి టీటీడీ చైర్మ‌న్‌తో ఒప్పించి.. ఖాయం చేశారు.

టాటాగ్రూపు సంస్థ ఎప్పుడు.. ఎక్క‌డ మ‌న‌సు మార్చుకుంటుందోన‌న్న ఆందోళ‌న‌తో.. నిత్యం.. స్వ‌యంగా చంద్ర‌బాబే.. ఈ ప్రాజ‌క్టును ప‌రిశీలించారు. ప‌ర్య‌వేక్ష‌ణ‌కు..అప్ప‌టి వైద్య శాఖ మంత్రి.. కామినేని శ్రీనివాస్‌తో ఒక క‌మిటీని కూడా ఏర్పాటు చేశారు. త‌ర్వాత‌..ఆయ‌న‌ప్ర‌భుత్వం నుంచిత‌ప్పుకొన్నాక‌.. సీఎం స్వ‌యంగా చూసుకున్నారు. ఇది.. ఇప్పుడు సాకారం అయింది. అయితే.. ఇంత చేసిన చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా.. అధికారంలో ఉన్న జ‌గ‌న్‌.. అంతా త‌న ప్ర‌తిభేన‌ని.. చాటు కోవ‌డం.. ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.