పీకే వెనుక ఉన్న‌ది ఎవ‌రో తెలిసిపోయింది

ప్ర‌శాంత్ కిషోర్‌… ప్రాంతీయ రాజ‌కీయాలే కాకుండా జాతీయ రాజ‌కీయాల్లో  కూడా ఓ సంచ‌ల‌నం. వ్యూహ‌క‌ర్తగా విజ‌యం సాధించిన పీకే అక్క‌డి నుంచి రాజ‌కీయ నేత‌గా అడుగులు వేద్దాం అనుకున్న స‌మ‌యంలో కాంగ్రెస్‌తో జ‌ర్నీకి సిద్ధ‌మ‌య్యారు. అయితే, చర్చలు ఎంతకు తెగకపోవటంతో.. తాజాగా కొత్త పార్టీ ఆలోచనలు ప్రశాంత్ కిషోర్ పంచుకున్నాడు.

త్వరలో జాతీయ పార్టీని స్థాపించబోతున్నట్టు సోషల్ మీడియాలో హింట్ ఇచ్చేశాడు. దీంతో దేశ రాజకీయాల్లో మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు ఈ స్ట్రాట‌జిస్ట్‌. అయితే, ఎందుకు పీకే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు? పీకేను న‌డిపిస్తోంది ఎవ‌రు? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్ర‌స్తుత ట్రెండ్‌కు త‌గిన‌ట్టు డిజిటల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ ని ఉపయోగిస్తూ చేసే పీకే స్ట్రాటజీస్ మోడీని ప్రధాని చేయటం నుండి ఎందరినో ముఖ్యమంత్రి పీఠాలని ఎక్కించింది. అయితే ఆ తరువాత బీజేపీతో బంధం తెగటం, అనంత‌రం బీహార్ లో నితీశ్ కుమార్, ఏపీలో జగన్, తమిళనాడులో స్టాలిన్, యూపీలో అఖిలేష్, పంజాబ్ లో కెప్టెన్ అమరీందర్ సింగ్, బెంగాల్ లో మమతా బెనర్జీల కోసం పీకే పని చేయ‌డం తెలిసిన సంగ‌తే. ఇక రాజ‌కీయ నేత‌గా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో పని చేయాలని భావించినప్ప‌టికీ చివ‌రి ద‌శ‌లో అది కుదరలేదు.

దీంతో సొంత పార్టీని ఆయ‌న ప్ర‌క‌టించేసి సంచ‌ల‌నానికి తెర దించారు. అయితే, రాజకీయ పార్టీ స్థాపించటం సుల‌భ‌మే కానీ న‌డిపించ‌డం కోట్ల ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పటికే ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఖర్చులు పెట్టుకోలేక కనుమరుగయ్యాయి. అలాంటిది ఒక జాతీయ పార్టీ నిర్వ‌హ‌ణ అంటే ల‌క్షల కోట్ల పెట్టుబడితో కూడుకున్న పని. మరి పీకేకి ఇది సాధ్యమా.. లేక వెనుకనుండి పీకేని ఎవరైనా నడిపిస్తున్నారా అనే టాక్ తెర‌మీద‌కు వ‌స్తోంది. వివిధ రూపాల్లో వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం, పీకే వెనుక ఉన్న‌ది ప్రాంతీయ పార్టీల నేత‌లని అంటున్నారు. అన్ని రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలకు, జాతీయ పార్టీలకు మాస్టర్ మైండ్ పీకే సత్తా ఏంటో తెలుసు.

దాంతో పీకే కొత్త పార్టీతో కాంగ్రెస్, బీజేపీలలో ఎవరికీ ముప్పు.. పీకే పార్టీతో ఎవరెవరు కలిసివస్తారు.. అసలు పీకే కొత్త పార్టీ వెనుక ఉన్న వారెవరు అంటూ తేల్చేస్తున్న విశ్లేష‌కులు పీకే వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ స‌హా బీహార్ సీఎం నితీశ్, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్, ఏపీ సీఎం వైఎస్ జగన్, ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మమతాబెన‌ర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ ఉన్నట్టు ఊహాగానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలాఉండ‌గా, పీకే పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే వారందరితో మరో రెండు, మూడు రోజుల్లోనే ప్రశాంత్ కిషోర్ చర్చలు జరుపుతారని తెలుస్తోంది. దాంతో పీకే కొత్తపార్టీ వెనుకున్నది ఎవరో అఫీషియల్ గా తెలిసిపోనుంది.