రాజకీయం అన్నాక.. ప్రత్యర్థి పార్టీల మధ్య ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం అయితే.. దీనికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. మంత్రిగా ఉన్న నాయకులు. కీలకమైన పోస్టుల్లో ఉన్న వారు.. ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే.. ఈ రేఖను తుడిచేస్తున్న.. టీడీపీ.. వైసీపీ నాయకులు… చేస్తున్న రాజకీయాలు తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. అదేసమయంలో ఆయా పార్టీల అభిమానులను కూడా కలవరపెడుతున్నాయి.
ఎందుకంటే.. తాజాగా ఈ రెండు పార్టీల మధ్య చోటు చేసుకున్న “చీరల రాజకీయం“ చిల్లర రాజకీయంగా మారుతోందనే విమర్శలు వస్తున్నాయి. “రాజకీయాలు హద్దు అదుపు లేకుండా పోతోంది. గతంలో నాయకులు మీడియా ముందుకు వస్తే.. రాష్ట్ర అభివృద్ధి గురించి.. సమస్యల గురించి.. ఉన్నత స్థాయిలో ఆలోచనలు పంచుకునేవారు. ఇప్పుడు.. మీడియా ముఖం చూడాలంటేనే.. బాధపడుతున్నాం. ఆ పార్టీ ఈపార్టీ అని తేడాలేదు. ఎవరికివారు రేటింగ్ కోసం.. చేస్తున్న ప్రయత్నాలు బాధపెడుతున్నాయి“ అని మేధావులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లను ఉద్దేశించి.. చీరలు పంపించమంటారా? చుడీదార్లు పంపించమంటారా? అని వ్యాఖ్యానించారు. నిజానికి ఒక మహిళ అయి ఉండి.. పైగా బాధ్యతాయుత మంత్రి అయి ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై మేధావులే విస్మయం వ్యక్తం చేశారు. ఇక, దీనిని టీడీపీ అక్కడితో వదిలేయకుండా.. కొనసాగింపు రాజకీయం చేసింది. పార్టీ మహిళా నేత.. ఒకరు.. సీఎం జగన్‌కు ఏ చీర పంపించమంటారని వ్యాఖ్యానించారు.
దీంతో ఈ విషయం మరింత రాజుకుంది. ఇక, ఈ విషయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా వ్యాఖ్యలు చేశారు. మీరు పంపించే చీరను మా అమ్మకు పంపిస్తానన్నారు. తప్ప.. రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకని.. లోకేష్ కూడా ప్రశ్నించలేదు. దీనిని ఖండించనూ లేదు. దీంతో ఈ రాజకీయాలు చూస్తున్న మేధావులు.. ఇలాంటి రాజకీయాలతో ఏపీ పరువు పోతోందని అంటున్నారు. రెండు పార్టీలూ.. మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకొంటున్నప్పుడు.. ఇలా.. చీరల రాజకీయం చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.