అమాయ‌కుడైన కేటీఆర్.. నో కామెంట్స్ ప్లీజ్ !

రెండు తెలుగు రాష్ట్రాల‌కూ రెండు వేర్వేరు ధోర‌ణులు ఉన్నాయి. ప్ర‌భుత్వాలు కూడా విభిన్న ఆర్థిక ప‌రిస్థితుల‌నూ, స్థితిగ‌తుల‌నూ చ‌వి చూస్తున్నాయి. గ‌తం క‌న్నా వేగంగా ప‌నిచేసే క్ర‌మానికి ఇటు టీజీ స‌ర్కారు కానీ అటు ఏపీ స‌ర్కారు కానీ ప్ర‌యత్నిస్తున్నాయి. అందుకు త‌గ్గ విధంగా ప్ర‌ణాళిక‌లు కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ద‌శ‌లో రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య దూరం పెరిగే అవ‌కాశాలు రాకూడ‌దు. ప‌రిణామాలు రాకూడ‌దు.

ఎవ‌రి పాల‌న వారిదే క‌నుక పాలించి నిర్దేశించి ఎదుగుద‌ల ఆశించ‌డంలో త‌ప్పే లేదు. కానీ అన‌వ‌స‌ర వ్యాఖ్య‌ల కార‌ణంగా లేదా అత్యుత్యాహం కార‌ణంగా కొన్ని వివాదాలు మోయ‌క త‌ప్ప‌దు. ఈ నేప‌థ్యంలో నిన్న‌టి వేళ క్రెడాయ్ మీట్ అందుకు వేదిక‌గా నిలిచింది. ఈ వేదిక‌పై నుంచి కేసీఆర్ చేసిన వేడి వ్యాఖ్య‌లు మరింత అగ్గి రాజుకునేలా చేశాయి. మాట‌లు మంట‌లు ఎపిసోడ్ నిన్న చాలా సేపు కొన‌సాగింది రాజ‌కీయంలో ! అయితే కేటీఆర్ త‌న‌దైన వ్యాఖ్య‌లు త‌ప్పు అని తెలుసుకుని దిగివ‌చ్చారు. వివాదం కూడా స‌ర్దుమ‌ణ‌గ‌నుంది.

ఇవాళ నేను చేసిన అమాయ‌క‌పు వ్యాఖ్య నా ఆంధ్రా సోద‌రుల‌ను బాధ పెట్టి ఉంటుంది. నేను ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో మంచి స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నాను. ఇక‌పై కూడా అదేవిధంగా మా బంధం ఉంటుంది. ఆయ‌న నేతృత్వంలో పొరుగు తెలుగు రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాల‌ని ఆకాంక్షిస్తున్నా.. అని కేటీఆర్ రాసుకొచ్చారు ట్విట‌ర్ లో.. ! దీంతో నిన్న రేగిన తుఫాను ఇక‌పై ఆగిపోతుంద‌ని భావించాలి. లేదా వైసీపీ శ్రేణులు శాంతిస్తాయి అని కూడా భావించాలి మ‌రియు ఆశించాలి. పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణతో స‌ఖ్య‌త, స‌త్సంబంధాలే ప్రామాణికం కావాలి.

ఓ విధంగా ఏపీ సీఎం జ‌గ‌న్ తో కానీ లేదా మునుప‌టి సీఎం చంద్ర‌బాబుతో తెలంగాణ స‌ర్కారు త‌గువులు పెట్టుకున్న‌ది లేదు. ఆస్తుల పంపకం పూర్తి కాక‌పోయినా కూడా  ఎవ‌రి దారి వారిదే అన్న‌విధంగా ఉన్నారు. అన్న‌ద‌మ్ములే కానీ కొట్టుకు చచ్చేంత కోపాలతో అయితే ఎవ్వ‌రూ లేరు. ఆంధ్రా ప్ర‌జ‌లను బాగానే చూసుకుంటున్నారు కేసీఆర్. ఇంకా చెప్పాలంటే ఈ ప్రాంత నాయ‌కుల‌తో అక్క‌డి నేత‌లకు స‌త్సంబంధాలే ఉన్నాయి. క‌నుక కేటీఆర్ చేసిన అమాయ‌క‌పు వ్యాఖ్య దుమారం రేపినా అవ‌న్నీ క్షణికాలే అని గుర్తిస్తే మేలు.