నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పోటీ చేయబోయే వైసీపీ అభ్యర్థి ఫైనల్ అయిపోయింది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయిన కారణంగా ఈ స్ధానాన్ని ఇంకోకరితో భర్తీ చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ స్థానాన్ని గౌతమ్ సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి తో భర్తీ చేయాలని ఇటు కుటుంబం అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే చేశారు.
తమ కుటుంబం తరపున విక్రమ్ ను అభ్యర్ధిగా ప్రతిపాదిస్తున్నట్లు తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్వయంగా జగన్ను కలిసి ప్రతిపాదించారు. దానికి జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో విక్రమే ఆత్మకూరులో తొందరలో జరగబోయే ఉపఎన్నికల్లో అభ్యర్ధిగా ఫైనల్ అయిపోయింది. గౌతమ్ మరణించగానే ఆయన భార్య శ్రీకీర్తి వారసురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని అందరు అంచనా వేశారు.
అయితే కుటుంబంలో ఏమి మాట్లాడుకున్నారో ఎవరికీ తెలీదు. మొత్తానికి వారసుడిగా విక్రమ్ ఫైనల్ అయిపోయారు. రెండోసారి మేకపాటి కుటుంబం జగన్ తో భేటీ అయ్యారు. తొందరలోనే విక్రమ్ నియోజకవర్గంలో పర్యటనలు మొదలుపెట్టబోతున్నట్లు చెప్పారు. అంటే ఇంతవరకు గౌతమ్ వారుసుడిగా మేకపాటి కుటుంబంలో ఎవరు కూడా పర్యటించలేదు. అందుకనే ముందుగా జగన్ కు చెప్పి తర్వాతే ఆత్మకూరులో పర్యటించాలని అనుకున్నట్లు రాజమోహన్ రెడ్డి చెప్పారు.
తమ ప్రతిపాదనకు, ఆలోచనలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మేకపాటి చెప్పారు. కాబట్టి తొందరలోనే నియోజకవర్గంలో విక్రమ్ పర్యటించబోతున్నారు. అంటే కేంద్ర ఎన్నికల కమీషన్ ఉపఎన్నిక ప్రక్రియను ప్రకటించటమే ఆలస్యం. ఇదే సందర్భంలో మిగిలిన ప్రతిపక్షాలు ఏమి చేస్తాయన్నది ఆసక్తిగా మారింది. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా ? లేకపోతే పోటీ నుంచి తప్పుకుంటారా అన్నది తేలలేదు. ఇక బీజేపీ తరపున కచ్చితంగా పోటీ చేయబోతున్నట్లు పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే ప్రకటించారు. మరి మిగిలిన పార్టీలు ఏమి చేస్తాయో చూడాల్సిందే. కాకపోతే ఉపఎన్నికలనేది కేవలం లాంఛనమనే చెప్పాలి. ప్రతిపక్షాలు అన్నీ కలిసినా ఇక్కడ ఉపఎన్నిక ఏకపక్షమవుతుందని అందరికీ తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates