ప‌ద్మ‌భూష‌ణ్‌ ఇస్తామ‌ని.. సోనియాకు 2 కోట్లు

కాంగ్రెస్ ను ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌ట్టాలెక్కించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న సోనియా గాంధీకి.. దిమ్మ‌తిరిగి పోయే అంశం తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌తిష్టాత్మ‌క‌ ప‌ద్మ‌భూష‌ణ్ ఇప్పిస్తామంటూ.. సోనియా కోసం రూ.2 కోట్ల‌ను త‌న తో ఖ‌ర్చు పెట్టించారని.. ఎస్‌. బ్యాంక్ చైర్మ‌న్ రాణా కపూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తనపై జరుగుతున్న కేసు విచారణలో భాగంగా ఈడీకి కీలక విషయాలను వెల్లడించారు.

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ద‌గ్గ‌ర ఉన్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ ను  రూ.2 కోట్లకు  కొనుగోలు చేయాలని తనను బలవంతం చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాదు… ఈ విష‌యంలో నాటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న మురళీ దేవరా త‌న‌ను తీవ్ర‌స్థాయిలో బలవంతం చేసినట్లు చెప్పారు. ప్ర‌స్తుతం రాణాను విచారిస్తున్న‌ ఎన్ఫోర్స్మెంట్ డెరక్టరెట్ (ఈడీ)కి ఆయ‌న ఇచ్చిన వాంగ్మూలంలో ఈ సంచ‌ల‌న విష‌యాలు ఉండ‌డం గ‌మ‌నార్మం.

రూ.2 కోట్ల‌కు బదులుగా తనకు పద్మభూషణ్ పురస్కారం లభిస్తుందనే హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ వివరాలను ముంబయిలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ఈడీ ప్రస్తావించింది. చెక్కు ద్వారా తాను అందించిన రూ.2 కోట్లను న్యూయార్క్లో సోనియా గాంధీ చికిత్స కోసం వినియోగించినట్లు రాణా కపూర్ తెలిపారు. అయితే తనకు ఇచ్చిన  ప‌ద్మ విభూష‌ణ్ హామీ మాత్రం నెరవేరలేదని అన్నారు.

“సోనియా చికిత్సకు సహకరించడం ద్వారా ఆ కుటుంబానికి చాలా మంచి పని చేశానని ఆమె సన్నిహితుడు అహ్మద్ పటేల్ నాతో అన్నారు. నాకు పద్మభూషణ్ అందడంలో ఇది తోడ్పడుతుందని చెప్పారు. అయితే ఈ కొనుగోలు బలవంతంగా జరిగింది, అందుకు(అవ‌ర్డును ప్ర‌క‌టించినా.. స్వీక‌రించేందుకు) నేను సిద్ధంగా లేను” అని రాణా పేర్కొన్నారు.

రాణా కపూర్, ఆయన కుటుంబంపై నమోదైన మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. గౌతమ్ థాపర్కు చెందిన అవంతా కంపెనీకి ఎస్ బ్యాంక్ నుంచి అక్రమంగా రూ.1900 కోట్ల రుణాన్ని అందిచ డంపైనా కేసు నమోదైంది. అందుకోసం రాణాకు రూ.300 కోట్ల లంచం ముట్టిందని ఈడీ ఆరోపించింది.ఈ క్ర‌మంలో రాణా.. అస‌లు సంబంధమే లేని.. సోనియా కేసు-ప‌ద్మ‌విభూష‌ణ్ అంశాన్ని తెర‌మీదికి తేవడం ఆస‌క్తిగాను.. విచిత్రంగాను ఉంది. మ‌రి దీనిపై కాంగ్రెస్ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.