జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంచల్‌గూడ జైల్లో షటిల్ ఆడుకున్నవాళ్లా.. నాకు నీతులు చెప్పేది! అంటూ.. మండిపడ్డారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్న పవన్.. తాజాగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ అంటే తనకు ఏమాత్రం ద్వేషం లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెప్పారు. అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాల దీన స్థితిపై కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టానన్నారు.
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను కలుసుకుని ఆర్థిక సాయం అదించినట్టు తెలిపారు.. వైసీపీ నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నిలదీస్తామని ఆయన హెచ్చరించారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపారు. కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల కష్టాలు కనిపించడం లేదన్నారు. తనను దత్తపుత్రుడని ఇంకోసారి అంటే.. సీబీఐ దత్తపుత్రుడు అని తానూ అనాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించారు. చంచల్‌గూడ జైల్లో షటిల్ ఆడుకున్న వాళ్లా..తనకు నీతులు చెప్పేది అని పవన్‌కల్యాణ్ హెచ్చరించారు.
కాగా, దీనికి ముందు జిల్లాకు వచ్చిన పవన్‌కు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. గజమాలతో ఘన స్వాగతం పలికారు. పెదవేగి మండలం విజయరాయిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లికార్జున కుటుంబాన్ని.. పవన్ పరామర్శించారు. మృతుని భార్యకు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబ నేపథ్యం వివరాలను అడిగి తెలుసుకుని.. తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెం, చింతలపూడి మండలంలో ఆత్మహత్య చేసుకున్న పదకొండు రైతు కుటుంబాలను.. పవన్ పరామర్శించారు.
అంతకుముందు పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు.. భారీగా అభిమానులు, జనసైనికులు తరలివచ్చారు. గజమాలతో అధినేతకు స్వాగతం పలికారు. ఈ క్రమంలో దుగ్గిరాల వద్ద పవన్ కాన్వాయ్‌ను అనుసరిస్తున్న బైక్‌ను.. కారు ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తికి గాయాలవ్వగా.. ఆస్పత్రికి తరలించారు. లింగపాలెం వద్ద పవన్ ప్రయాణిస్తున్న కారుకు పంక్చర్ అయ్యింది. పంక్చర్ వేసేవరకు.. పవన్ కల్యాణ్ ఆక్కడే ఉండి పర్యటన కొనసాగించారు. ఇదిలావుంటే, గతంలోనూ పవన్ అనంతపురంలో కౌలు రైతు కుటుంబాలను పరామర్శించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ ఏడాది పాటు.. పవన్ ఇదే యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అదేసమయంలో రూ.5 కోట్ల వరకు ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం చేయనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates