ముఖ్యమంత్రి జగన్ అవినీతికి అడ్డుపడుతూనే ఉంటామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని నెక్కలగొల్లగూడెంలో పర్యటించిన ఆయన.. జగన్ దోపిడీకి అడ్డుకట్ట వేసి తీరాలని ప్రజలకు పిలుపుని చ్చారు. బుధవారం చంద్రబాబు తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఉదయం అంతా హడావుడిగా కనిపించారు. అనంతరం.. రాత్రి పొద్దుపోయాక ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని నెక్కలగొల్లగూడెంలో పర్యటించారు.
అడవి నెక్కలం గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి పర్యటన మెుదలుపెట్టారు. మెుదట పాదయాత్ర చేపట్టాలని భావించినా.. భారీగా కార్యకర్తలు, ప్రజలు తరలిరావటంతో పాదయాత్రకు వీలుకాక రోడ్షో నిర్వహించారు. అడవి నెక్కలం గ్రామం నుంచి నెక్కలంగొల్లగూడెం గ్రామం వరకు సాగిన రోడ్ షోలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీసీ, ఎస్సీ వర్గాలతో కలిసి చంద్రబాబు సహపంక్తి భోజనం చేశారు. అనంతరం నెక్కలంగొల్లగూడెం గ్రామంలో ఓ చెట్టు కింద ఏర్పాటు చేసిన గ్రామసభలో చంద్రబాబు పాల్గొన్నారు. గ్రామ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో వ్యవసాయం దుర్భరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యాన పంటలకు ఎలాంటి రాయితీ అందడం లేదని వాపోయారు. ఉన్నత విద్యకు రుణాలు ఇవ్వడం లేదని విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ విద్యా పథకం కూడా అమలుకావటం లేదని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. జగన్ దోపిడికి అడ్డుకట్ట వేసి తీరాలని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ అవినీతికి అడ్డుపడుతూనే ఉంటామని అన్నారు. ఎంత అప్పు తెచ్చారో జగన్ చెప్పి తీరాలన్నారు.
“పోలవరంలో అవినీతి అంటూ దుష్ప్రచారం చేశారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకెళ్లి 3 సీజన్లు దాటినా పట్టించుకోలేదు. ఇప్పుడు రూ.800 కోట్ల అదనపు భారం మోపారు. పోలవరం కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది. రాష్ట్రం మొత్తం పూర్తిగా నష్టపోయింది. ప్రజలను పట్టించుకోని వైసీపీ నేతలను ఉరితీయాలి. సన్న బియ్యం ఇస్తానంటూ ఉన్న బియ్యం పోగొడుతున్నారు. జగన్ అవినీతికి అడ్డుపడుతూనే ఉంటాం. అప్పు ఎంత తెచ్చారో జగన్ చెప్పి తీరాలి. జగన్ దోపిడీకి అడ్డుకట్ట వేసి తీరాలి` అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాబుకు వైసీపీ నేత ఫిర్యాదు!
నెక్కలంగొల్లగూడెంలో చంద్రబాబు గ్రామసభలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని గ్రామసభకు వచ్చిన వైసీపీ నేత కాజా రాంబాబు చంద్రబాబును కోరారు. గ్రామంలో జరిగిన రూ.75 లక్షల అవినీతిపై పోరాడుతున్నానని రాంబాబు చంద్రబాబుతో చెప్పారు. నూజివీడు ఎమ్మెల్యే వెంకట ప్రతాప్ అప్పారావు కుమారుడు అవినీతికి పాల్పడ్డారని రాంబాబు ఆరోపించారు. ఎమ్మెల్యే కుమారుడి అవినీతిపై పోరుకు మద్దతివ్వాలని ఆయన చంద్రబాబును కోరారు. రాంబాబు పోరాటాన్ని పార్టీలకు అతీతంగా చూడాలని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలకు సూచించారు. ఆయనకు అండగా ఉంటామని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates