వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతు న్నాయి. కొన్నాళ్లుగా తీవ్ర ఆరోపణలు.. అవినీతి వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్న విజయసాయిరెడ్డికి పార్టీ బాధ్యతల నుంచి ముఖ్యంగా విశాఖపట్నం, ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో విశాఖలో టీడీపీ నేతల విమర్శలకు జగన్ చెక్ పెట్టారు. నిజానికి విజయసాయిరెడ్డి పార్టీలో కీలకనాయకుడు. గత ఎన్నికల నుంచి కూడా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. పార్టీ సమన్వయ కర్తగా ఉత్తరాంధ్రలో పార్టీ విజయానికి కృషి చేశారు.
గత ఏడాది జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖలో వైసీపీ పాగా వేసేలా సాయిరెడ్డి ప్రయత్నించారు. సక్సెస్ కూడా అయ్యారు. అయితే.. అదే సమయంలో ఆయనపైనా.. ఆయన అల్లుడిపైనా… తీవ్ర విమర్శలు వచ్చా యి. ముఖ్యంగా గనులు.. భూముల కబ్జా ఆరోపణలు వెల్లువెత్తాయి. టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు.. ఆధారాలతో సహా నిరూపించేందుకు రెడీ అయ్యారు. అయినప్పటికీ.. కొన్నాళ్లుగా ఉదాసీనంగా ఉన్న జగన్.. తాజాగా పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని గ్రహించారు. ఇదే పరిస్థితి ఉంటే కష్టమని అనుకున్నారో.. ఏమో.. వెంటనే మార్పులు చేశారు.
విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తూ నిర్ణయం తీసుకు న్నారు. అదేసమయంలో ఆ బాధ్యతలను జగన్ తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. ఇక, మం త్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డిలకు మాత్రం 62 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. విజయ సాయిరెడ్డికి మాత్రం బాధ్యతలు అప్పగించలేదు. వైవీ సుబ్బారెడ్డికి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు.
విశాఖపట్నం కేంద్రంగా నేటి వరకు పార్టీ, ప్రభుత్వం తరఫున బాధ్యతలు నిర్వహించిన విజయసాయిపై పార్టీలోని నేతలే అసంతృప్తి స్వరాలు వినిపించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భూ ఆక్రమణలకు సంబంధించి పలు ఆరోపణలు.. అదే విధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ నేతల నుంచి ఆరోపణలు రావడం.. దీనిపై పలుమార్లు పంచాయతీ జరిగిన సందర్భంగా సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఇది ఒక్కటే కాదని.. ఇలాంటి విజయసాయిరెడ్డిలు చాలా మంది ఉన్నారని.. పార్టీలో పెద్ద టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇది చాలదు.. మరింత పెంచాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెడితేనే.. పార్టీ మరోసారి పుంజుకుంటుందని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates