వైసీపీ కి సంబంధించి ఉత్తరాంధ్ర పరిణామాలను మరింత గా ప్రభావితం చేసే నేతల నియామకం జరిగింది. దీంతో ఇంతకాలం ఇక్కడ రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న విజయ సాయిరెడ్డిని తప్పించారు. అంతా ఊహించని విధంగా ప్రాంతీయ సమన్వయకర్తల నియామకం పూర్తైంది. ఇకపై వీరంతా కొత్త బాధ్యతల్లో తలమునకలు కాక తప్పదు. త్వరలో ప్రారంభం కానున్న గడపగడపకూ వైసీపీ కార్యక్రమానికి వీరంతా నేతృత్వం వహించనున్నారు. అదేవిధంగా క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశం అవుతూ వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వీరంతా మరింత సమర్థనీయ రీతిలో పనిచేయనున్నారు.
శ్రీకాకుళం జిల్లాకు మరియు విజయనగరం జిల్లాకు రీజనల్ కో ఆర్డినేటర్ గా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవహరించనున్నా రు. దీంతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాకు ఆయన కో ఆర్డినేటర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మొత్తం 19 నియోజక వర్గాలకు ఆయన ఇంఛార్జిగా ఉండనున్నారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఎనిమిది నియోజకవర్గాలున్నాయి. విజయ నగరం జిల్లా పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. అదేవిధంగా కొత్తగా ఏర్పాటయిన పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. తాజా నియామకం ప్రకారం బొత్స రీజనల్ కో ఆర్డినేటర్ గా వ్యవహరించడమే కాకుండా పార్టీని బలోపేతం చేసే ప్రతి కార్యక్రమానికీ ప్రణాళిక రచించనున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆయన పదవి మరింత క్రియాశీలకంగా ఉండనుంది. వాస్తవానికి నిన్నమొన్నటి మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు నో ఛాన్స్ అనే అనుకున్నారు. మాజీ మంత్రి కొడాలి, మరో మాజీ మంత్రి పేర్ని నాని మాదిరిగానే వివాదాస్పద మంత్రిగా పేరున్న ఆయనను తప్పిస్తారని అంతా నిర్థారణకు వచ్చారు. ఆయన స్థానంలో అదే కుటుంబం నుంచి ఆయన తమ్ముడు బొత్స అప్పల నర్సయ్య (గజపతి నగరం నియోజకవర్గ ఎమ్మెల్యే)కు ఛాన్స్ ఉంటుందని కూడా భావించారు. కానీ అవేవీ కాని పనులు అని చివరి నిమిషంలో తేలిపోయింది. దాంతో మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలో భాగంగా బొత్స సత్యనారాయణకు విద్యాశాఖ దక్కిన విషయం విధితమే! ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులుగా ధర్మాన కృష్ణదాస్ ను నియమించారు.
విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ఉండనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి వ్యవహరించనున్నారు. తాజా మాజీలందరికీ దాదాపు పార్టీ పదవుల్లోకి తీసుకున్నారు. ఎక్కడా ఎవ్వరినీ ఖాళీగా ఉంచలేదు. వీలున్నంత వరకూ వారికి పార్టీ సంబంధ పనులను అప్పగించి స్థానికంగా నెలకొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చేలా వారికి ఓ నిర్థిష్ట కార్యాచరణ అప్పగించనున్నారు. ఇక ఇదే సమయంలో మరో కీలక నేత వైవీ సుబ్బారెడ్డి విశాఖ రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమితులు అయ్యారు. ప్రస్తుతం ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్న విషయం విధితమే!