మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానమే దెబ్బకొట్టింది.. అవకాశం వచ్చినప్పుడు నేనూ అధిష్టానాన్ని దెబ్బకొడతా… లక్షశాతం హింసావాదినే..ఈ బోడి రాజకీయాలు నాకెందుకు ?..మంత్రి పదవిని ఆశించి భంగపడిన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎంఎల్ఏ గొల్ల బాబూరావు చేసిన వ్యాఖ్యలు. నియోజకవర్గం పర్యటనలో ఉన్నపుడు గొల్ల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రెండో క్యాబినెట్ ఏర్పడిన దగ్గర నుండి హింసావాదిని అనే మాట ఎంఎల్ఏ చాలాసార్లే చెప్పారు.
డైరెక్టుగా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా తన అసంతృప్తిని అనేక రూపాల్లో బయటపెడుతున్నారు. అయితే ఇక్కడే చాలా మందిలో ఒక అనుమానం పెరిగిపోతోంది. అధిష్టానాన్ని తాను కూడా దెబ్బకొడతానని చెప్పారు. ఆ కొట్టే దెబ్బేదో ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయటం ద్వారా కొట్టచ్చుకదాని. ఎంఎల్ఏ పదవికి వెంటనే రాజీనామా చేసి ఉపఎన్నికలు వచ్చేట్లు చేస్తే సరిపోతుంది. ఉపఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ గానో లేకపోతే ఏదో పార్టీ తరపునో పోటీచేసి గెలిస్తే అధిష్టానాన్ని గట్టి దెబ్బ కొట్టినట్లవుతుంది.
ఇంత మంచి అవకాశం చేతిలో ఉంచుకుని ఊరికే సమయం వృధా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందదని గొల్లకు అర్ధం కావటంలేదు. మంత్రి పదవికి రానందుకు తనపై ఆశలు పెట్టుకున్న లక్షల మందికి తాను ఏమని సమాధానం చెప్పాలని అడగటమే విచిత్రం. ప్రతి ఎంఎల్ఏ మీద లక్షలమంది ఆశలు పెట్టుకుంటారు. కానీ వైసీపీ తరపున గెలిచిన 151 మందిలో మంత్రి పదవులు ఇవ్వగలిగింది కేవలం 25 మందికి మాత్రమే. మరి మిగిలిన 125 మంది తమ జనాలకు ఏమని సమాధానం చెప్పుకుంటున్నారు. బాబూరావు వచ్చినట్లే చాలామంది కాంగ్రెస్ లో నుండే జగన్మోహన్ రెడ్డితో పాటు బయటకు వచ్చేశారు.
అలంటివాళ్ళల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్ లాంటి వారికి మంత్రి పదవులను బహిరంగంగా హామీ ఇచ్చి కూడా జగన్ ఇవ్వలేకపోయారు. కాబట్టి ఉన్న పరిమితులను బాబూరావు ముందు తెలుసుకోవాలి. కాదు కూడదంటే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో తిరిగి గెలిస్తేనే జగన్ను దెబ్బకొట్టినట్లవుతుంది. కాబట్టి అనవసరంగా మాట్లాడే బదులు రాజీనామా చేసే విషయాన్ని బాబూరావు ఆలోచిస్తే బాగుంటుంది.