వైఎస్ వల్ల విద్యుత్ రంగం దివాలా తీసిందా ?

కీలకమైన స్ధానాల్లో దశాబ్దాల తరబడి పనిచేసిన ఇద్దరు విశ్రాంత ఐఏఎస్ అధికారులు తాజాగా చెప్పిన మాటలు ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్దితిని దృష్టిలో పెట్టుకుని చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతు ‘మేలుకోకుంటే మనకూ శ్రీలంక గతే పడుతుంది’ అన్నారు. అలాగే సుదీర్ఘకాలం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా తర్వాత ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా పనిచేసిన పీవీ రమేష్ మాట్లాడుతూ ‘ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఇక ఆపేయాలి’ అన్నారు.

ఆర్ధికంగా రాష్ట్రం తీవ్రమైన సంక్షోభంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెంటనే మేల్కొనాలని గట్టిగా హెచ్చరించారు. ఇందులో వాస్తవం ఉందికా బట్టి ఎల్వీని తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఆర్ధిక పరిస్ధితి ఎంతకాలంగా ఇలాగుంది అనేదే కీలకం. 2014లో రాష్ట్ర విభజన జరగటమే రు. 16 వేల కోట్ల లోటుతో మొదలైంది. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రం మరిన్ని అప్పులు చేసింది. జగన్ హయాంలో ఈ అప్పులు డబుల్ అయ్యాయి… ఇంకా పెరిగిపోతున్నాయి.

 లోటుతో మొదలైన ప్రభుత్వం అప్పులతోనే నడుస్తుందని ఎల్వీ, రమేష్ కు తెలీదా ? సంక్షేమ పథకాలు ఎక్కువైపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని అందరికీ తెలిసిందే. సంక్షేమ పథకాల అమలన్నది ఇపుడే కాదు చాలాకాలంగా నడుస్తున్నదే. ఎల్వీ, రమేష్ ఆర్ధికశాఖ ఉన్నతాధికారులుగా పనిచేసినపుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రులకు ఇపుడు చెప్పిన మాటలు చెప్పారా అన్నదే కీలకం. తాము ఉన్నత స్థానాల్లో ఉన్నపుడు సంక్షేమ పథకాలకు డబ్బులు పంచటం ఎక్కువైపోతోందన్న విషయాన్ని ముఖ్యమంత్రులకు చెప్పినట్లు ఎప్పుడూ వినలేదు.

రాష్ట్రంపై నిజంగా వీళ్ళద్దరికీ అంత ప్రేముంటే తాము కీలక స్ధానాల్లో పని చేసినపుడే ముఖ్యమంత్రులకు చెప్పుండాల్సింది. పైగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ 2004లో ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ వల్లే విద్యుత్ రంగం దివాలా తీసిందని ఇపుడు చెప్పటమే విచిత్రంగా ఉంది. వైఎస్ హామీ ఇచ్చినపుడే విద్యుత్ రంగం భవిష్యత్తును రమేష్ ఎందుకు చెప్పలేదు ? తాము కీలక స్థానాల్లో పనిచేసిన రోజుల్లోనే ఇపుడు చెప్పిన విషయాలను ముఖ్యమంత్రులకు చెప్పుంటే బాగుండేది. అధికారాలన్నింటీనీ అనుభవించేసి తర్వాత సలహాదారులుగా కూడా పనిచేసి బయటకు వచ్చేసిన తర్వాత ఇపుడు ఆర్ధిక పరిస్ధితి ఆందోళనకరమని చెప్పటమే విచిత్రంగా ఉంది.