ఊపిరి పీల్చుకున్న వైసీపీ నేతలు

నెల్లూరు జిల్లాలోని వైసీపీ నేతలంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి కారణం ఏమిటంటే ఒకవైపు మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి మరోవైపు మాజీమంత్రి అనీల్ కుమార్ యాదవ్ సభలు ఒకేసారి ఒకే ప్రాంతంలో జరగటమే. దీనికన్నా ముఖ్యమైన కారణం ఏమిటంటే వీళ్ళద్దరికీ అసలు పడకపోవటమే. ఇద్దరిలో ఎవరుముందు సభ నిర్వహించాలని అనుకున్నారో తెలీదు కానీ నేతల్లో మాత్రం టెన్షన్ పెరిగిపోయింది.

ఇద్దరికీ కావాల్సిన నేతలు కొందరు ఒకరిని సభ రద్దుకానీ లేదా తేదీ మార్చుకోమని ఇద్దరితోను మాట్లాడినా ఉపయోగం లేకపోయింది. మంత్రయిన తర్వాత కాకాణి మొదటిసారి జిల్లాకు వస్తున్న కారణంగా ఏర్పాట్లు భారీగా జరిగింది. ఇదే సమయంలో మాజీ అయిన తర్వాత అనీల్ పెట్టుకున్న మొదటిసభ కాబట్టి అందరిలోను ఆసక్తి పెరిగిపోయింది. నేతలు కానీ పోలీసులు కూడా ఎవరి సభకు అభ్యంతరాలు వ్యక్తంచేసే అవకాశం లేకుండాపోయింది.

అందుకనే మీడియా మొత్తం అనీల్ ది బలనిరూపణ వేదికగానే ప్రచారం చేసింది. అయితే వేర్వేరుగా మాట్లాడిన కాకాణి, అనీల్ ఇద్దరు కూడా పార్టీ గెలుపు, 2024 ఎన్నికల్లో అన్నీస్ధానాల్లో పార్టీని గెలిపించుకోవటం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లాంటి కామన్ అంశాలను మాత్రమే టచ్ చేయటంతో రెండుసభలు ప్రశాంతంగానే ముగిశాయి. అనీల్ మాట్లాడుతు తాను నిర్వహించిన సభ బలనిరూపణ కాదని స్పష్టంగా చెప్పారు. రెండుసార్లు గెలిచిన తాను కొత్తగా బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ఇదే సమయంలో ఆత్మీయ సమావేశంలో కాకాణి మాట్లాడుతు తన నియోజకవర్గంలో అనీల్ సభ నిర్వహించుకుంటే అది బలప్రదర్శన ఎలాగవుతుందని తేలిగ్గా తీసుకున్నారు. ఇదే సమయంలో జిల్లాలోని నేతలందరి సహకారంతో వచ్చే ఎన్నికల్లో కూడా కచ్చితంగా అన్నీ సీట్లను గెలుచుకుంటామని చెప్పారు. దాంతో ఇద్దరు కూడా ఒకరిపై మరొకరు పరోక్షంగా కూడా ప్రస్తావన లేకుండా జాగ్రత్తపడ్డారు. బహుశా జగన్ నుండి ఏదైనా సంకేతాలు అందిన కారణంగానేమో ఇద్దరి స్పీచ్ దాదాపు ఒకటిగానే ఉంది. దాంతో జిల్లాలోని నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు.