అంగరంగ వైభవంగా రామోజీ ఇంట ‘పెళ్లి సందడి’

ఎవరేమన్నా సరే.. ఈనాడు రామోజీ.. రామోజీనే. వేలాది కోట్లు సంపాదించనీ.. అత్యుత్తమ స్థానానికి చేరనీ.. కానీ ఆయన స్థాయి మాత్రం ఎవరికీ సాధ్యం కాదంతే. ఆయన రేంజ్ ఎంతన్న విషయం ఆయనింట జరిగే పెళ్లిళ్లు చెప్పేస్తాయి. తాజాగా ఆ విషయం మరోసారి నిరూపితమైంది.

రామోజీ మనమరాలు (ఆయన చిన్న కుమారుడు కమ్ ఈనాడు ఎండీ కిరణ్.. మార్గదర్శి ఎండీ శైలజా దంపతులు రెండో కుమార్తె) బృహతి వివాహ వేడుక రామోజీ ఫిలింసిటీలో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా సాగింది. శనివారం అర్థరాత్రి 12.18 గంటలకు జరిగే వివాహ వేడుకకు సాయంత్రం నుంచి వీవీఐపీలు పోటెత్తారు. రెండు తెలుగురాష్ట్రాల్లో ఏ ప్రముఖుడి ఇంట పెళ్లి జరిగినా కూడా.. ఎక్కడా చూడని.. వినని కాంబినేషన్లలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కావటం రామోజీకి మాత్రమే సొంతం.
తాజాగా ఆ విషయాన్ని మరోసారి నిరూపించారు ఈనాడు సంస్థల అధినేత రామోజీ.

ఇంతకీ రామోజీ మనమరాలిని పెళ్లాడిన యువకుడు ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. కిమ్స్ సంస్థలకు చెందిన అక్షయ్. ఈ పెళ్లి వేడుకకు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ విపక్ష నేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సహా.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులంతా ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

ఓవైపు రాజకీయ ప్రముఖులు.. మరోవైపు న్యాయ సంస్థలకు చెందిన ప్రముఖులు.. పారిశ్రామిక వర్గాలకు చెందిన వారు.. సినిమా.. క్రీడా.. విద్యా రంగానికి చెందిన వారు.. ఇలా వారు.. వీరు అన్న తేడా లేకుండా ఈ వివాహ వేడుకకు పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరయ్యారు. ఒక పెళ్లికి న్యాయ రంగానికి చెందిన ఇంత మంది జడ్జిలు హాజరు కావటం ఇదే అవుతుందని చెప్పాలి. ఏమైనా.. చూస్తే రామోజీ ఇంట పెళ్లినే చూడాలనేలా ఏర్పాట్లు మొత్తాన్ని రామోజీ ఫిలింసిటీలో నిర్వహించారు.

పెళ్లికొడుకు వైద్య రంగానికి చెందిన వ్యక్తి కావటంతో.. ప్రముఖ వైద్యులు సైతం ఈ పెళ్లికి క్యూ కట్టారు. ప్రముఖ వైద్యులు బొల్లినేని భాస్కరరావు (కిమ్స్ ఎండీ).. యశోదా జనరల్ ఫిజిషీయన్ కమ్ సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు.. హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ వైద్య సంస్థల అధినేతలు.. పేరున్న వైద్యులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఐటీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు.. దేశంలోని వివిధ మీడియా సంస్థలకు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఏమైనా.. వింటే రామాయణం వినాలి.. చూస్తే రామోజీ ఇంట పెళ్లిని చూడాలనిపించేలా వివాహ వేడుక సాగిందంటే నమ్మక తప్పదు.