ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ హోంమంత్రి, కాపుసంక్షేమ సేన వ్యవస్ధాపక అధ్యక్షుడు, జనసే న కీలకనాయకుడు చెగోండి హరిరామజోగయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాత్రి, పగలు అనకుండా పల్లెలు, పట్టణాలు అని లేకుండా గంటల తరబడి విద్యుత్ కోతలు అనధికారికంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దౌర్భాగ్య స్ధితిని ప్రజలు చూడలేదని తెలిపారు. నిరవధిక విద్యుత్ సరఫరా చేయలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అనుభవ రాహిత్యమే అని ఆయన వ్యాఖ్యానిం చారు.
నవరత్నాలు అనేక మందికి అందిస్తున్నామని సీబీఐ దత్తపుత్రుడు జగన్ చెపుతున్నారని యెద్దేవా చేశారు. ఈ పథకాల ద్వారా 10 శాతం మంది ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదన్నారు. తమ జేబులు నింపుకోవడ మే ధ్యేయంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా చేసే ప్రాజెక్టులు ప్రైవేటు వ్యక్తులకు తక్కవ ధరకు అమ్మడం, పోరుగు రాష్ట్రాల నుండి ఎక్కువ ధరకు విద్యుత్ కొనడం వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. గోరుచుట్టుపై రోకలి పోటులా విద్యుత్ కోతలకు తోడుగా విద్యుత్ చార్జీల పెంపు ఈ ప్రభుత్వం చేసిందని ఆగ్రహించారు.
ఇలాంటి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దె దించి జనసేన గ్యారేజ్ దెబ్బ రుచి చూపించాలని హరిరామ జోగయ్య వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. పవన్.. సీబీఎన్ దత్తపుత్రుడని.. జగన్ ఏమైనా కలలు గన్నారా? అని ప్రశ్నించారు. తాము మాత్రం జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడుగానే ఇక నుంచి చూస్తామని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఏం చెప్పారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. తాజా మంత్రి వర్గ కూర్పుపై మాట్లాడుతూ… ఇదొక కుర్మా కూర్పుగా అభివర్ణించారు. దీనిలో అన్నీ.. జగనే చూసుకుంటారని.. ఎవరికీ ఎలాంటి అధికారాలూ లేవన్నారు.
మంత్రులు అందరూ మూకుమ్మడిగా.. వరుస పెట్టి సీఎం జగన్ కాళ్ల మీదపడడాన్ని చూస్తేనే.. ఆయన కూర్పు ఎలా ఉందో అర్ధమవుతోందని అన్నారు. అంతగా కాళ్లమీద పడాలని అనుకుంటే.. ముందే ఆ పనిచేసి.. తర్వాత ప్రమాణం చేయొచ్చుకదా? అని ప్రశ్నించారు. బీసీలకు సంక్షేమం అమలు చేయకుండా.. ఎన్ని పదవులు ఇచ్చినా.. ప్రయోజనం ఉండదని.. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.