త‌మిళిసై వ్య‌వ‌హారం.. కేసీఆర్ ఫైర్‌.. ఏమ‌న్నారంటే!

తెలంగాణలోని కేసీఆర్ ప్ర‌భుత్వానికి, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి మ‌ధ్య ఏర్ప‌డిన వివాదం.. మ‌రింత ముదురుతోంది. తాజాగా జ‌రిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ తమిళిసై ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారని, పర్యటనలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గవర్నర్‌ అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

చాలా అంశాల్లో తమిళిసైది వితండవాదమని.. రాష్ట్ర ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. త‌మ‌ను,త‌మ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా.. వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ఇది ఎంత మాత్రం స‌హించేది లేద‌ని..కేసీఆర్ స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలిసింది. అంతే కాదు.. ఏ విష‌యంలో నూ వెన‌క్కి త‌గ్గాల్సిన అవ‌స‌రం లేదని..కొంద‌రు బీజేపీ నేత‌లుచెబుతున్న మాట‌ల వ‌ల్లే ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చిందని.. ప్ర‌భుత్వాన్ని ఏదోఒక‌ర‌కంగా బ‌ద్నాం చేయాల‌ని కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. ఇక‌, మంత్రులు సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది.

మ‌రోవైపు.. తన అధికారిక పర్యటనల్లో ప్రొటోకాల్‌ పరంగా నిబంధనలు పాటించడం లేదనే విషయాన్ని తాను ఎవరికి చెప్పాలో వారికి చెప్పానని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. ‘ప్రొటోకాల్‌’ విషయాన్ని తాను కంప్లెయింట్‌గా చూడనని, కాంప్లిమెంటరీగా చూస్తానని అన్నారు. ఇటీవల గవర్నర్‌ పర్యటనల్లో ప్రొటోకాల్‌ పాటించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతుండటం, కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఆమె రెండు రోజుల పర్యటనలోనూ ముఖ్య అధికారులు దూరంగా ఉండటంపై గవర్నర్‌ పైవిధంగా స్పందించారు. రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌కు మధ్య దూరం పెరిగిందంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రశ్నించంగా ‘అలాంటిదేమీ లేదు.. ఆ గ్యాప్‌ ఎంత దూరం ఉందో మీరే చెప్పండి’ అని వ్యాఖ్యానించారు.