ఇంకా జ‌గ‌న్ పాటే.. మాజీ మంత్రిపై ఆ సామాజిక వ‌ర్గం గుర్రు!

తాజాగా ఏపీలో ఏర్ప‌డిన జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో కీల‌క‌మైన వైశ్య సామాజిక వ‌ర్గానికి స్థానం ద‌క్క‌లేదు. గ‌త కేబినెట్‌లో మాత్రం విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే వెలంప‌ల్లి శ్రీనివాస్‌కు అవ‌కాశం క‌ల్పించారు. కానీ, తాజాగా మంత్రి వ‌ర్గంలో ఎవ‌రికీ అవ‌కాశం ఇవ్వ‌లేదు. పోనీ..ఎమ్మెల్యేలు లేరా..అంటే.. కీల‌క‌మైన అన్నా రాంబాబు(గిద్ద‌లూరు), కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి(విజ‌య‌న‌గ‌రం) ఉన్నారు. అయినా.. వీరికి ప్రాధాన్యం లేకుండా పోయింది. దీంతో వైశ్య సామాజిక వ‌ర్గం.. స్వ‌చ్ఛందంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది. అయితే.. ఇంత జ‌రుగుతున్నా..తాజా మాజీ మంత్రి వెలంప‌ల్లి.. జ‌గ‌న్‌ను కొనియాడారు. కీర్తించారు. ప‌నిలో ప‌నిగా.. చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు సంధించారు. దీంతో వైశ్య సామాజిక వ‌ర్గం.. నిప్పులు చెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఇంత‌కీ.. వెలంప‌ల్లి ఏమ‌న్నారంటే..

నాపై నమ్మకం ఉంచి దేవాదాయ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారని, సంతృప్తితో శాఖ బాధ్యతలు నిర్వర్తించానని వెలంప‌ల్లి వ్యాఖ్యానించారు. దేవాదాయ శాఖ భూములు రక్షణ, ఆలయాల భద్రతకు పెద్ద పీట వేశామన్నారు. దుర్గ గుడికి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకున్నాన న్నారు. దుర్గ గుడి ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం పుష్కరాల పేరుతో కూల్చేసిన గుళ్లను మూడేళ్ళలో నిర్మించాం అని తెలిపారు.

అంతర్వేది రధం పునర్నిర్మాణం చేసామని, రామతీర్థం ఆలయం అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేవాదాయశాఖలో ఏ నిర్ణయం తీసుకున్న సీఎం అడ్డు చెప్పలేదన్నారు. అర్చకులకు వంశపారంపర్యం గా కొనసాగింపు, ఇళ్ల నిర్మాణం లాంటి వాటిని ఆమోదించేలా అడుగులు వేసామన్నారు. టీడీపీ, జనసేన తొత్తులు వైశ్యుల‌కు వైసీపీ అన్యాయం చేసిందని అసత్య ప్రచారం చేస్తున్నారన్నార‌ని మండిప‌డ్డారు.

14 ఏళ్లలో ఆర్య వైశ్యులకు చంద్రబాబు చేసింది శూన్య‌మని వెలంప‌ల్లి.. విరుచుకుప‌డ్డారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 126 సత్రాలను తిరిగి వైశ్యుల‌కు దక్కేలా సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆర్య వైశ్యుల‌ మనోభావాలు దెబ్బతినేలా ఉన్న చింతామణి నాటకాన్ని రద్దు చేసిన ముఖ్యమంత్రి ఆర్య వైశ్యుల‌ పక్షపాతి అన్నారు. ఆర్య వైశ్యులకు సీఎం జగన్ పెద్ద పీట వేశారన్నారు.

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పొట్టి శ్రీరాముల వర్ధంతిని ఘనంగా నిర్వహించలేని దౌర్భాగ్యంలో అనాడు చంద్రబాబు ఉన్నాడన్నారు. జగన్ సీఎం అవ్వగానే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారని తెలియచేశారు. పొట్టి శ్రీరాములు జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. సామాజిక విప్లవానికి సీఎం జగన్ అడుగులు వేశారన్నారు. ఆర్య వైశ్యుల పట్ల టీడీపీ, జనసేన ముసలి కన్నీరు కారుస్తున్నాయన్నారు.

ఆర్య వైశ్యులు చంద్రబాబు మాయలో పడొద్దని వెలంప‌ల్లి విజ్ఞప్తి చేశారు. దిక్కుమాలిన రాజకీయాలు చేసే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. నాకు అడక్కుండానే మంత్రి పదవి ఇచ్చారు, క్యాడర్ ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎస్సి, ఎస్టీ, బిసిలకు సీఎం జగన్ పెద్ద పీట వేశారన్నారు. సీఎం జగన్ మంత్రి పదవులు ఇచ్చినప్పుడే రెండున్నరేళ్లు ఉంటుందని చెప్పారన్నారు మంత్రి పదవులకు రాజీనామాలు చేసామన్న ఆందోళన ఎవరికీ లేదన్నారు.